ISRO Fake Scientist Arrest : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3లోని ల్యాండర్ మాడ్యూల్ తానే రూపొందించినట్లు ఓ ట్యూషన్ టీచర్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అంతే కాకుండా ఇస్రో తనను అసిస్టెంట్ ఛైర్మన్‌గా నియమించినట్లు ఓ లేఖను కూడా చూపిస్తూ స్థానికంగా ఫేమస్ అయ్యాడు. అయితే అనుమానమొచ్చిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది.
అసలేం జరిగిందంటే?
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన మితుల్ త్రివేది.. స్థానికంగా ఉన్న విద్యార్థులను ట్యూషన్ చెబుతుంటాడు. అయితే చంద్రయాన్-3 విజయం తర్వాత తాను కూడా ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు స్థానికులకు చెప్పాడు. అంతే కాకుండా చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్‌ను రూపొందించినట్లు చెబుతూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. తనను ప్రాచీన సైన్స్ అప్లికేషన్ డిపార్ట్మెంట్కు అసిస్టెంట్ ఛైర్మన్‌గా ఇస్రో నియమించినట్లు ఇచ్చినట్లు ఓ ఫేక్ లెటర్‌ను కూడా చూపించేవాడు.
అయితే అతడిపై అనుమానమొచ్చిన కొందరు వ్యక్తులు.. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మితుల్పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. మితుల్ చెప్పేవన్నీ అబద్ధాలేనని తేల్చారు. దీంతో అతడిని మంగళవారం.. అరెస్ట్ చేశారు. ఇస్రో అందించినట్లుగా అతడు చెబుతున్న లేఖ నకిలీది అని పోలీసులు చెప్పారు.
మితుల్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసు కమిషనర్ శరద్ సింఘాల్ తెలిపారు. తాము ఇస్రోను సంప్రదించామని.. మితుల్ చూపుతున్న లేఖ నకిలీదని ప్రకటించారు. అతడు ప్రైవేట్ ట్యూషన్ టీచర్ అని.. తన తరగతులకు ఎక్కువ మంది విద్యార్థులను రప్పించేందుకు ఇలా చేశాడని వివరించారు. అతడు బీకామ్, ఎంకామ్ చదివినట్లు సర్టిఫికెట్లు ఉన్నాయని వెల్లడించారు.
అప్పుడే పుట్టిన పిల్లలకు చంద్రయాన్ పేరు!
Chandrayaan 3 Name To Babies : మరోవైపు చంద్రయాన్-3 మిషన్ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని తమ సంతానానికి పేర్లు పెడుతున్నారు కొందరు తల్లిదండ్రులు. తమ చిన్నారులకు 'చంద్రయాన్' అని నామకరణం చేయాలనుకుంటున్నట్లు తెలిపారు ఒడిశాకు చెందిన కొందరు దంపతులు. చంద్రయాన్-3 సక్సెస్ అయిన సమయంలోనే తమ పిల్లలు జన్మించడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు.
ఆగస్టు 23వ తేదీ సాయంత్రం.. కేంద్రాపఢ జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో నలుగురు చిన్నారులు జన్మించారు. వీరిలో ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడ శిశువు ఉన్నారు. దుర్గా మండలంలోని తలచువా గ్రామానికి చెందిన జోష్నారాణి ఆడపిల్లకు జన్మనివ్వగా.. నీలకంఠాపుర్కు చెందిన బాల్, అంగులేయ్ గ్రామానికి చెందిన బేబీనా సేథి.. మగబిడ్డలకు జన్మనిచ్చారు. వీరంతా తమ పిల్లలకు చంద్రయాన్ అని పేరు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు కారణం కూడా చెప్పారు. అదేంటో తెలియాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.