ISRO Aditya L1 Mission Launch Date In India : చంద్రయాన్-3 మిషన్ విజయవంతం చేసిన ఇస్రో తదుపరి ప్రయోగానికి సిద్ధమవుతోంది. సూర్యుడి వాతావరణ పరిస్థితులపై పరిశోధన కోసం సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1ను ప్రయోగించేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రేంజ్ పాయింట్ ఎల్-1 వద్ద ఈ వ్యోమనౌకను మోహరించనున్నారు. సూర్యుడిపై పరిశోధనలకు రోదసిలో తొలి భారతీయ అబ్జర్వేటరీగా ఈ వ్యోమనౌక పనిచేయనుంది.
Aditya L1 Launch Vehicle : ఆదిత్య ఎల్-1ను వివిధ జాతీయ సంస్థల భాగస్వామ్యంతో దేశీయంగానే తయారు చేసినట్లు ఇస్రోకు చెందిన ఓ అధికారి తెలిపారు. యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ నుంచి రెండు వారాల క్రితమే ఉపగ్రహం శ్రీహరికోటకు చేరుకుందని చెప్పారు. ఎల్-1 పాయింట్ వద్ద ఉపగ్రహాన్ని మోహరించడం వల్ల గ్రహణం వంటి అవాంతరాలు లేకుండా సూర్యున్ని నిరంతరం వీక్షించే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
ISRO Aditya L1 Mission Details : సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్ ఇది. ఉపగ్రహం బరువు 1,500 కిలోలు. సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంలో దాని ప్రభావంపై అధ్యయనం చేసేందుకు ఇస్రో.. ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనుంది. భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ 1.. చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ కక్ష్యలోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది.
Aditya L1 Mission Manufacturers : ఆదిత్య-ఎల్ 1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది. ఇందులో ప్రధానమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ VELCతో పాటు సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మ్యాగ్నెటోమీటర్ పేలోడ్‌లను అమర్చనున్నారు.
ISRO Aditya L1 Sun Mission : సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుడి వెలుపలి పొరలు, సౌరశక్తి కణాలు, సూర్యుడి అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలించనున్నాయి. ఆదిత్య-ఎల్1లోని నాలుగు పేలోడ్‌లు నేరుగా సూర్యుడిని వీక్షిస్తాయి. మిగిలిన మూడు పేలోడ్‌లు ఎల్1 వద్ద కణాలు, క్షేత్రాల అధ్యయనాలు నిర్వహిస్తాయి.
PM Modi Visits ISRO : 'ఇస్రో విజయం అసాధారణం.. శాస్త్రవేత్తలకు సెల్యూట్'.. మోదీ భావోద్వేగం