ISHA Farmer Producer Organisation : రైతులను సంఘటితం చేస్తూ అన్నదాతల సాధికారతకు కృషి చేస్తున్న ఈశా రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్పీఓ) అద్భుతమైన ఫలితాలు రాబడుతోంది. దేశవ్యాప్తంగా వేల మంది రైతులను ఏకతాటిపైకి తీసుకొచ్చి.. వ్యవసాయంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా తోడ్పాటు అందిస్తోంది. ఆర్థిక కష్టాల్లో ఉన్న రైతుల కోసం రుణాలు సైతం అందిస్తోంది.
ఏంటీ సంస్థ?
రైతుల అభ్యున్నతి కోసం 2013లో ఈశా ఫౌండేషన్ అధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ(ఎఫ్పీఓ)ను స్థాపించారు. వెల్లింగిరి ఉజావన్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ పేరుతో ఇది పనిచేస్తోంది. సాంకేతిక, మార్కెటింగ్ వనరులతో రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఇది ఏర్పాటైంది. రైతులను శక్తిమంతంగా తయారుచేయడం, ఉత్పాదకతను పెంచడం, పంటలకు మార్కెట్ సదుపాయాలు కల్పించడం, అన్నదాతల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలనే ఆశయంతో ఈ సంస్థ ముందుకెళ్తోంది. ఈ మేరకు రైతుల సమగ్ర అభివృద్ధికి ఈశా ఎఫ్పీఓ ఎంతగానో కృషి చేస్తోంది.
ఏఏ కార్యక్రమాలు చేస్తోందంటే?
రైతుల్లో వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు సమగ్ర శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఈశా ఎఫ్పీఓ. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవలంబించడం, పంటల సాగులో వైవిధ్యాన్ని పాటించడం, వాటి నిర్వహణ, కోతల అనంతరం అనుసరించాల్సిన విధానాలపై రైతులకు శిక్షణనిస్తోంది. పంటల దిగుబడి, వాటి నాణ్యతను పెంచేందుకు రైతులకు కావల్సిన నైపుణ్యాలను ఈ సంస్థ నేర్పిస్తోంది. ఇప్పటి వరకు 1,063 మంది రైతులకు ఈశా ఎఫ్పీఓ అండగా నిలిచింది. అందులో 38 శాతం మహిళలే ఉండటం గమనార్హం.
రైతుల సాధికారతకు కృషి చేయడం..
దేశ వ్యాప్తంగా వేల మంది రైతులకు సాధికారత అందించేందుకు ఈశా ఎఫ్పీఓ కృషి చేస్తోంది. రైతులందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి, వారిలో ధైర్యాన్ని నింపి.. సవాళ్లను సమర్థవంతంగా, కలసికట్టుగా ఎదుర్కోనేలా తోడ్పాటు అందిస్తోంది. 2020-21 సంవత్సరంలో దీని టర్నోవర్ విలువ రూ.14 కోట్లుకు చేరింది.
మార్కెట్ సంబంధాలు..
రైతులకు ప్రత్యక్షంగా మార్కెట్ సదుపాయలను కల్పించడం ఈశా ఎఫ్పీఓ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. దళారుల నుంచి రైతులకు విముక్తి కల్పించడం, వారి ఉత్పత్తులకు నాణ్యమైన ధరను అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కొనుగోలుదారులు, చిల్లర వ్యాపారులు, ఎగుమతిదారులతో రైతులకు బలమైన సంబంధాలను ఏర్పరుస్తోంది. రైతులు తమ ఉత్పత్తులను పోటీ ధరలకు విక్రయించి.. మెరుగైన లాభాలు పొందేందుకు వీలు కల్పిస్తోంది.
విలువ జోడింపు, ప్రాసెసింగ్ కార్యకలాపాలు..
రైతులు తమ పంటల విలువను పెంచుకునేలా, ప్రాసెసింగ్ కార్యకలాపాల్లో వారంతా నిమగ్నమయ్యేలా ఈశా ఎఫ్పీఓ ప్రొత్సహిస్తోంది. నాణ్యతా ప్రమాణాలు, మార్కెట్ డిమాండ్‌లకు అనుగుణంగా పంటల గ్రేడింగ్, క్రమబద్ధీకరణ, ప్యాకేజింగ్, ప్రాసెసింగ్ వంటి కార్యకలాపాలు ఇందులో ఇమిడి ఉంటాయి.
ఆర్థిక సాయం..
రైతులకు ఆర్థిక సాయం కూడా అందిస్తోంది ఈశా ఎఫ్పీఓ. ఆర్థిక సంస్థల సహకారంతో తక్కువ వడ్డీలకు రుణాలు ఇవ్వటం, పంటలకు బీమా కల్పించడం వంటి వాటిల్లో రైతులకు చేదోడువాదోడుగా ఉంటోంది. అదేవిధంగా ఇతర ఆర్థిక సంస్థల సాయంతో వ్యవసాయంలో పెట్టుబడి పెట్టి.. రైతులకు నష్టభయాన్ని తగ్గిస్తోంది.
సామాజిక ప్రభావం..
తమ కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక మార్పులు తీసుకువచ్చేలా ఈశా ఎఫ్పీఓ నిరంతరం కృషి చేస్తోంది. ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మహిళ రైతులకు తోడ్పాటు అందించడం, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇవన్నీ రైతు వర్గాల్లో సామాజిక-ఆర్థిక అభివృద్దికి దారితీశాయి.
ఈశా పౌండేషన్ తన కార్యక్రమాలతో భారత ప్రభుత్వం ద్వారా క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్ (CBBO)గా గుర్తింపు పొందింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ.. దేశంలో 10వేల కొత్త ఎఫ్పీఓలను ఏర్పాటు, వాటి ప్రచారం కోసం ఓ పథకం సైతం ప్రారంభించారు. అందులో 23 ఎఫ్పీఓలకు వచ్చే ఐదేళ్లలో ఈశా పౌండేషన్ మద్దతు అందించనుంది. ఈ విధానాలతో రైతులను జీవన స్థితిని మెరుగుపరచడం, వారిని ఆర్థికంగా మెరుగుపరచడం వంటి లక్ష్యాలను ఈశా తన ముందు పెట్టుకుంది.