కరోనా వ్యాక్సిన్ ఎగుమతులపై తక్షణమే తాత్కాలిక నిషేధం విధించాలని కోరుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. దేశంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ టీకాలు వేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ సరఫరాలో రాష్ట్రాలకు మరింత తోడ్పాటు అందించాలని సూచించారు. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో.. బలహీన వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అండగా నిలవాలని మోదీని కోరారు రాహుల్.
"వ్యాక్సిన్ తయారీదారులకు టీకా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు తగిన వనురులను కల్పించాలని నేను కోరుతున్నాను. అవసరమైన ప్రతి ఒక్కరికీ టీకా అందించే కార్యక్రమాన్ని చేపట్టండి. వ్యాక్సిన్ల సేకరణ, సరఫరా కోసం కేటాయించిన రూ.35,000 కోట్ల నిధులను రెట్టింపు చేయండి."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
దేశంలో వ్యాక్సిన్ కొరత సమస్య వేధిస్తోంటే.. ఆరు కోట్ల టీకా డోసులను విదేశాలకు కేంద్రం ఎగమతి చేసిందని రాహుల్ గాంధీ తన లేఖలో విమర్శించారు. టీకా కొరత దృష్ట్యా ప్రాధాన్య క్రమంలోనే వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పిన మరుసటి రోజే రాహుల్ ఈ లేఖ రాయటం గమనార్హం.
'టీకా ఎగమతులపై పర్యవేక్షణ ఉందా? లేదా ప్రభుత్వం తీసుకున్న అనేక ఇతర నిర్ణయాల్లానే.. ప్రజల ఖర్చుతో పబ్లిసిటీ పొందే ప్రయత్నమా?' అని రాహుల్ ప్రశ్నించారు. విపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతున్నారని విమర్శించారు.
'ప్రమాదంలోకి నెట్టి.. ఎగమతులా?'
అంతకుముందు.. దేశవాసుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి, విదేశాలకు సరఫరా చేయడం సరైన చర్యేనా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా రాహుల్ ప్రశ్నించారు. కరోనా విజృంభణ కొనసాగుతున్న తరుణంలో టీకాల కొరత అనేది తీవ్రమైన సమస్య అని పేర్కొన్నారు. ఇది వేడుక చేసుకునే సమయం కాదని విమర్శించారు.
ఇదీ చూడండి: చురుగ్గా 'అందరికీ టీకా'నే అత్యంత కీలకం