వాతావరణ సంక్షోభం నానాటికీ తీవ్రమవుతున్న నేపథ్యంలో పరిష్కార మార్గాలపై యావత్ ప్రపంచం మల్లగుల్లాలు పడుతోంది. ఇందులో భాగంగా రవాణా రంగంలో హైడ్రోజన్ వంటి హరిత ఇంధనాలను ప్రవేశపెట్టే అంశంపై దేశాలు దృష్టిసారిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రంగం శిలాజ ఇంధనాలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. విమానయానంతో పోలిస్తే.. రైల్వే ప్రయాణాలు ఒకింత పర్యావరణ అనుకూలమే. అయినా అంతర్జాతీయ గ్రీన్‌హౌస్ ఉద్గారాల్లో రైల్వేల వాటా 1 శాతంగా ఉంది. దీనికి ప్రధాన కారణం డీజిల్ ఇంజిన్‌లే.
ప్రత్యామ్నాయాలపై దృష్టి
ఐరాస ఇచ్చిన 'రేస్ టు జీరో' స్ఫూర్తితో 2050 నాటికి కర్బనరహిత వ్యవస్థగా మారాలని అనేక రైల్వే కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రధానంగా హైడ్రోజన్‌పై దృష్టిపెట్టాయి. ఆర్థికంగా విద్యుదీకరణకు అనుకూలంగా లేని మార్గాల్లో ఈ ఇంధనంతో నడిచే రైళ్లు ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ దిశగా జర్మనీ ముందడుగు వేసింది. ఈ ఏడాది ఆగస్టులో ప్రపంచంలోని తొలి హైడ్రోజన్ రైలును ప్రవేశపెట్టింది. దీనికి 'కొరాడియా ఐలింట్' అని పేరుపెట్టారు. ఆల్‌స్టోమ్ సంస్థ వీటిని రూపొందించింది. జర్మనీలోని లోవర్ శాక్సోనీ ప్రాంతంలో 62 మైళ్ల రూట్‌లో 14 హైడ్రోజన్ రైళ్లు నడుస్తున్నాయి.
హైడ్రోజన్ రైలుతో ప్రయోజనాలు
- కర్బన ఉద్గారాలు శూన్యం. వీటి నుంచి నీరు, ఆవిరే వెలువడతాయి.
- పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి మేలు.
- ఒక కిలో హైడ్రోజన్.. 4.5 కిలోల డీజిల్‌కు సమానస్థాయిలో శక్తిని అందించగలదు.
- విద్యుదీకరణ ఆచరణ సాధ్యం కాని, సర్వీసులు పెద్దగా తిరగని గ్రామీణ మార్గాలకు వరం.
- ఈ రైళ్లు పెద్ద శబ్దాలు చేయవు.
- భూమిపై హైడ్రోజన్‌కు కొరతలేదు. సముద్ర నీటి నుంచి దీన్ని సేకరించొచ్చు. 20 నిమిషాల్లోపే ఇంధనాన్ని నింపొచ్చు.
ఇవీ ప్రత్యేకతలు
- కొరాడియా ఐలింట్ రైళ్లు హైడ్రోజన్ ఫ్యూయెల్-సెల్ టెక్నాలజీతో పనిచేస్తాయి. వీటి నుంచి హానికారక ఉద్గారాలు వెలువడవు.
- వీటి వల్ల ఏటా సుమారు 16లక్షల లీటర్ల డీజిల్ ఆదా అవుతుంది. ఫలితంగా సంవత్సరానికి 4వేల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ విడుదలకు అడ్డుకట్ట పడుతుంది.
- ఒక్కసారి ఇంధనం నింపితే ఈ రైళ్లు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఈ విషయంలో డీజిల్ ఇంజిన్లకు దీటుగా ఉంటాయి.
- హైడ్రోజన్ రైళ్లు గరిష్ఠంగా గంటకు 140 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. ప్రస్తుతం ఆ రూట్‌లో నడుస్తున్న రైళ్లు 80-120 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే సాధిస్తున్నాయి.
పనిచేసేది ఇలా
హైడ్రోజన్ రైళ్ల కోసం మార్పిడి చేసిన కంబషన్ ఇంజిన్లను వాడే వీలుంది. అయితే ఎక్కువగా హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇందులో విద్యుత్‌రసాయన ప్రక్రియ జరుగుతుంది. హైడ్రోజన్ ఇంధనం ఆక్సిజన్‌తో చర్య జరపడం ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతుంది. ఈ కరెంటును మోటారుకు ఫీడ్ చేస్తారు. తద్వారా రైలు నడుస్తుంది. ఈ ప్రక్రియలో వెలువడే ఉద్గారాలు నీరు, ఆవిరే.
- ఎలక్ట్రాలసిస్ పద్ధతిలో నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొడతారు. దీనికి పూర్తి వ్యతిరేక పద్ధతిని హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్స్‌లో అనుసరిస్తారు.
- హైడ్రోజన్ ఉత్పత్తికి చాలావరకూ శిలాజ ఇంధనాలను వాడుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా పర్యావరణ అనుకూల, సమర్థ విధానాలు వస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.
భారత్‌లో
భారత్‌లోని మొత్తం రైళ్లలో 37 శాతం.. డీజిల్ ఇంజిన్లతోనే నడుస్తున్నాయి. దేశంలో వెలువడుతున్న గ్రీన్‌హౌస్ ఉద్గారాల్లో రవాణా రంగం వాటా 12 శాతం కాగా.. అందులో రైల్వేల వాటా 4 శాతం. డీజిల్ ఇంజిన్లే ఇందుకు ప్రధాన కారణం. 2019-20 సంవత్సరంలో 237 కోట్ల లీటర్ల డీజిల్‌ను రైల్వే శాఖ వినియోగించింది. 2030 నాటికి 'నెట్‌జీరో' కర్బన ఉద్గారాల స్థాయిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న రైల్వేశాఖకు హైడ్రోజన్ రైళ్లు బాగా ఉపయోగపడతాయి.
ఆర్థికంగా ప్రయోజనకరం కాదని..
విద్యుదీకరణ పెరిగినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా డీజిల్ రైళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఐరోపాలో సగం కన్నా ఎక్కువ రైళ్లకు ఈ ఇంజిన్లే ఆధారం. వీటివల్ల అక్కడ ఏటా 3.8 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతున్నట్లు అంచనా. ఆదాయం పెద్దగా రాని మారుమూల ప్రాంతాల్లో భారీ ఖర్చుతో రైల్వే విద్యుదీకరణకు ప్రభుత్వాలు, సంస్థలు పూనుకోవడంలేదు.
డీజిల్‌తో ఆరోగ్యానికి హానికరం
- డీజిల్ రైళ్ల నుంచి వచ్చే పొగవల్ల నైట్రోజన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ తదితర విషవాయువులు, నుసి వంటి హానికర రేణువులు భారీగా వాతావరణంలోకి వెలువడతాయి.
- వాహన రద్దీ అధికంగా ఉన్న రోడ్డుపై నిలబడినప్పటితో పోలిస్తే డీజిల్ రైళ్లలో ప్రయాణం వల్ల ఎక్కువ మోతాదులో హానికారక రేణువులను పీల్చాల్సి వస్తుందని కోహెన్‌హాగెన్ విశ్వవిద్యాలయ పరిశోధనలో తేలింది. ఇంజిన్‌కు దగ్గరగా ఉన్న బోగీల్లోనివారికి వీటి తాకిడి 35 రెట్లు ఎక్కువ.
- డీజిల్ లోకోమోటివ్ ఉద్గారాలు రైల్వే స్టేషన్లు, యార్డులు, రేవుల వద్ద ఎక్కువగా పోగుపడుతున్నాయి. దీనివల్ల సమీపంలోని ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది.
- డీజిల్ ఉద్గారాల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, ఆస్థమా, అకాల మరణం ముప్పు పెరుగుతుంది.