International Flights Resume: కొవిడ్ నుంచి తేరుకుంటున్న వేళ.. పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీసులు గగనయానానికి సిద్ధమయ్యాయి. రెండేళ్ల తర్వాత యథావిధిగా విమానాల రాకపోకలు అదివారం నుంచి పునఃప్రారంభమవుతున్నాయి. ఈమేరకు విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు కొవిడ్‌కు ముందు మాదిరిగా సర్వీసులు నడిపేందుకు సన్నద్ధమవుతున్నాయి.
మహమ్మారి ప్రభావంతో ఒడుదొడుకులకు లోనైన విమానయాన పరిశ్రమ నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్న క్రమంలో.. అంతర్జాతీయ సర్వీసుల పునరుద్ధరణ ఆ రంగానికి మరింత ఊతమిస్తుంది. ఇప్పటికే భారతీయ విమానయాన సంస్థలు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేయగా.. వివిధ విదేశీ సంస్థలైన ఎమిరేట్స్, విర్ణిన్, అట్లాంటిక్, లాట్ పోలిష్, శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ వంటివి కూడా భారత్ నుంచి రాకపోకలకు ప్రణాళిక రూపొందించినట్లు ప్రకటించాయి.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో 2020 మార్చి 20 నుంచి భారత్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేశారు. ప్రస్తుతం వివిధ దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందం (ఎయిర్ బబుల్) మేరకు కొన్ని విమానాలు తిరుగుతుండగా.. ఆదివారం నుంచి అన్ని రెగ్యులర్ సర్వీసులనూ నడపడానికి అనుమతిస్తూ ఈనెల 8న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: మరో ఆర్నెళ్ల వరకు ఉచిత రేషన్ పథకం