అంతర్జాతీయ విమాన సర్వీసులపై (International flights from india) కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరినాటికి పూర్తి స్థాయిలో ఈ సేవలను పునరుద్ధరిస్తామని(Normal International flights resume) తెలిపింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సల్ వెల్లడించారు.
"అంతర్జాతీయ గమ్యస్థానాలకు పూర్తిస్థాయి విమాన సర్వీసులు అతిత్వరలో పునఃప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరినాటికి పూర్తిగా ఈ సర్వీసులను పునరుద్ధరిస్తాం. "
-రాజీవ్ బన్సల్, కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి
కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ ప్యాసింజర్ విమాన సర్వీసులు గతేడాది మార్చిలో రద్దయ్యాయి. విదేశీ ప్రయాణాలను పునఃప్రారంభించే లక్ష్యంతో కేంద్రం 25 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం.. కొన్ని నిబంధనలు పాటించి.. ఇరుదేశాల విమానయాన సంస్థలు సర్వీసులను నడపాల్సి ఉంటుంది.
ఇతర ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని..
ఇటీవల... భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) దిల్లీలో నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా... అంతర్జాతీయ విమాన సేవలను పూర్తిగా పునరుద్ధరించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని (Jyotiraditya Scindia news) తెలిపారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రక్రియపై సమాలోచనలు (normal international flight news) జరుపుతున్నామని చెప్పారు.
దేశీయంగా లైన్ క్లియర్..
దేశీయ విమాన సర్వీసులకు(Domestic flights india) సంబంధించి సీట్ల పరిమితిపై అక్టోబర్ 18 నుంచి కేంద్రం ఆంక్షలు ఎత్తివేసింది. గతేడాది లాక్‌డౌన్ సమయంలో దేశీయ విమానాలపై పూర్తి నిషేధం విధించింది కేంద్రం. లాక్‌డౌన్ అనంతరం 2020 మే 25న కొవిడ్ నిబంధనల మేరకు 33 శాతం సీటింగ్ కెపాసిటీతో విమానాలు నడిపేందుకు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ వరకు క్రమంగా 80 శాతానికి పెంచగా.. సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 1న ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించింది.
అనంతరం ఆగస్టు 12 నాటికి ఆక్యుపెన్సీని 72.5 శాతానికి పెంచింది. సెప్టెంబర్లో 85 శాతం సీటింగ్ సామర్థ్యంతో విమానాలను నడుపుకొనేందుకు విమానయాన సంస్థలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న క్రమంలో.. సీటింగ్ సామర్థ్యంపై పూర్తిగా ఆంక్షలు ఎత్తివేసింది.
ఇదీ చూడండి: విమాన టికెట్లు మరింత చౌక- లగేజీ లేకుంటేనే..!