చైనాతో సరిహద్దులు కలిగిన అరుణాచల్ ప్రదేశ్‌లో శరవేగంగా రోడ్లు, టెలికం వంటి మౌలిక వసతుల అభివృద్ధి, హైటెక్ సాధనాలు, ఆయుధ వ్యవస్థల సమీకరణతో మంచి జోరు మీదున్న భారత సైన్యం ఇప్పుడు సమీకృత పోరాట బృందాలు (ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్-ఐబీజీ)గా ఏర్పడటంపై దృష్టిపెట్టింది. దీనివల్ల ఈ రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతాల్లో యుద్ధరీతులే మారిపోతాయి. ఇక్కడ మన సైన్యం చేపడుతున్న మార్పుల్లో ఐబీజీలు ప్రధానాంశంగా ఉన్నాయి. ఈ దిశగా 2019లో 'హిమవిజయ్' పేరుతో నిర్వహించిన వినూత్న సైనిక విన్యాసాల్లో నేర్చుకున్న పాఠాలను ఆచరణలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ఏమిటీ ఐబీజీలు?
Integrated battle groups Indian army : బ్రిగేడ్ స్థాయి (3,500- 4వేల మంది సైనికులు) కన్నా ఐబీజీలు కొంచెం పెద్దగా ఉంటాయి. ఇందులో పదాతి, శతఘ్ని, ట్యాంకు, గగనతల రక్షణ దళాలు, పోరాట హెలికాప్టర్లు, ఇతర తోడ్పాటు విభాగాలు ఉంటాయి. గతంలో భారీ దాడి దళాలు (స్ట్రైక్ కోర్‌లు) యుద్ధరంగంలో ముందుండి పోరాటాలు సాగించేవి. వాటికన్నా తక్కువ సంఖ్యలో ఉండే ఐబీజీలు చాలా చురుగ్గా కదులుతాయి. వాటిలో అన్ని విభాగాలకు చెందిన బలగాలు ఉండటం వల్ల అవి స్వయం సమృద్ధంగా ఉంటాయి. సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో శత్రుభూభాగంలోకి మెరుపువేగంతో ఒడుపుగా దూసుకెళ్లగలవు. దేశ పశ్చిమ, ఉత్తర సరిహద్దుల్లో ఐబీజీలు త్వరలోనే ఏర్పాటుకానున్నట్లు నాటి సైన్యాధిపతి జనరల్ నరవణె ఈ ఏడాది జనవరిలో ప్రకటించడం ఇక్కడ ప్రస్తావనార్హం.
ఎం777- చినూక్ ద్వయం
అత్యంత తేలికపాటి ఎం777 శతఘ్నులను శరవేగంగా నిర్దేశిత ప్రాంతంలో మోహరించడం ఐబీజీ వ్యూహాల్లో కీలకం. ఈ ఆయుధాలను శక్తిమంతమైన చినూక్ హెలికాప్టర్లు తమ దిగువభాగంలో మోసుకెళతాయి. భారత వాయుసేన వద్ద ప్రస్తుతం 15 చినూక్‌లు ఉన్నాయి. ఈ తరగతికి చెందిన మరో 11 హెలికాప్టర్లను సమకూర్చుకునే ప్రతిపాదనలు ఉన్నాయి.
భౌగోళిక పరిస్థితులే కారణం..
అరుణాచల్ ప్రదేశ్‌లో ఐబీజీల ఏర్పాటు చాలా కీలకం. పెద్ద నదులు, లోయలు, ఎత్తయిన పర్వత ప్రాంతాలతో ఈ రాష్ట్రంలో చాలా సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడి కామెంగ్, సుబాన్‌సిరి, సియాంగ్, లోహిత్ నదులు హిమాలయాల నుంచి వచ్చే మంచు సాయంతో జలకళను సంతరించుకుంటున్నాయి. ఇక తిరాప్ నది పట్కాయ్ పర్వతాల నుంచి ప్రవహిస్తోంది. ఈ అవరోధాలను అధిగమిస్తూ సరిహద్దువ్యాప్తంగా మోహరించిన బలగాలను పరస్పరం అనుసంధానించడం సైన్యానికి పెద్ద సవాల్. ‘హిమవిజయ్’ విన్యాసాల్లో ప్రధానంగా దీనిపైనే కసరత్తు జరిగింది. ఐబీజీ మోహరింపులకు అనుగుణంగా సరిహద్దు ప్రాంతాల్లో వేగంగా మౌలిక వసతులను సమకూర్చుకోవడం కలిసొస్తోంది. ఇందులో రోడ్లు, వంతెనలు, సొరంగాలు, హెలిపాడ్‌ల నిర్మాణం, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్ ఏర్పాటు, గ్రామాల అభివృద్ధి వంటివి ఉంటున్నాయి.
దీనికితోడు నిఘా సామర్థ్యానికి పదును పెట్టేందుకు రాడార్లు, డ్రోన్లు, ఉపగ్రహాలను భారత సైన్యం రంగంలోకి దించింది. అధునాతన ఆయుధాలు, అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే మందుగుండు సామగ్రి, ఎలాంటి నేలపైనైనా దూసుకెళ్లగల వాహనాలు మన బలగాల పోరాటపటిమను ఇనుమడింపచేస్తున్నాయి.
ఇవీ చదవండి; 'కశ్మీర్లో 3 దశాబ్దాల తర్వాత సినిమా హాల్స్.. ఇకపై జిల్లాకో మాల్ పక్కా'
ఉచితాలపై తగ్గని ఆప్.. తటపటాయిస్తున్న భాజపా.. 2022 బాద్షా ఎవరో?