దేశంలోనే క్లీన్‌సిటీగా వరుసగా ఆరోసారి నిలిచి రికార్డు సృష్టించింది మధ్యప్రదేశ్ రాజధాని ఇందోర్. పర్యావరణ పరిరక్షణ కోసం వినూత్న ప్రయత్నాలు చేపడుతూ.. అందరికి ఆదర్శంగా నిలుస్తోంది ఇందోర్. ఇప్పటికే తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువులను తయారు చేస్తోంది. మురుగునీటిని శుభ్రం చేసి పబ్లిక్ గార్డెన్‌లు, పొలాలు, నిర్మాణ కార్యకలాపాలకు వినియోగించడం, మొక్కల నుంచి వచ్చిన చెత్తను ఎరువులుగా తయారు చేయడం.. ఇలా ఎన్నో కొత్త ప్రయత్నాలు చేసి దేశంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది ఇందోర్. ఇప్పుడు సరికొత్తగా ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా చేయాలని సంకల్పించింది. అందుకోసమే కాటన్ బ్యాగులు ఇచ్చే ఏటీఎంలను ఏర్పాటు చేసింది.
ఇందోర్ మున్సిపల్ కార్పొరేషన్లో పాలిథీన్ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. నగరంలోని మార్కెట్లలో పాలిథిన్ కవర్లు వాడితే భారీ జరిమానా విధిస్తున్నారు మున్సిపల్ అధికారులు. ప్లాస్టిక్ కవర్ల స్థానంలో పర్యావరణ హితంగా కాటన్ బ్యాగులు వాడాలని సూచిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యటకులకు సైతం ఉపయోగపడేలా కాటన్ బ్యాగ్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు మున్సిపల్ అధికారులు. ఈ ఏటీఎంల్లో పది రూపాయల నోటు లేదా నాణెన్ని పెడితే కొన్ని సెకన్లలో కాటన్ బ్యాగ్‌ను ఇస్తుంది. దీనికి యూపీఐ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. పర్యటకులను దృష్టిలో పెట్టుకుని వారు ఎక్కువగా సందర్శించే 56 షాప్స్ ప్రాంతంలోనే తొలి ఏటీఎంను ఏర్పాటు చేశామని చెప్పారు మున్సిపల్ కమిషనర్.
" సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నగరంలో బ్యాన్ చేశాం. ప్రస్తుతం నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో 5 ఏటీఎంలను ఏర్పాటు చేశాము. ప్రజల నుంచి వచ్చే స్పందనను చూసి వీటి సంఖ్యను పెంచుతాం. ప్లాస్టిక్ నిషేధంపై పోరాటంలో దేశంలోని అన్ని నగరాల కంటే ఇందోర్ ముందంజలో ఉంది."
-ప్రతిభాపాల్, మున్సిపల్ కమిషనర్
ఇవీ చదవండి: 'జయలలిత మృతికి మోదీనే కారణం'.. డీఎంకే ఎమ్మెల్యే వ్యాఖ్యలు
పాక్ చొరబాట్లకు రాడార్లతో చెక్.. సొరంగాలను గుర్తించే లేటెస్ట్ టెక్నాలజీ