Indore fire incident: మధ్యప్రదేశ్ ఇందోర్‌లోని విజయ్ నగర్లో శనివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ప్రేమించిన అమ్మాయి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు.. యువతి నివసిస్తున్న మూడంతస్తుల భవనానికి నిప్పు పెట్టాడు. దీంతో ఆ భవనంలో వివిధ ఫ్లాట్లలో నివసిస్తున్న తొమ్మిదిమంది మంటల్లో కాలిబూడిదయ్యారు. తీవ్రగాయాలతో మరో 9 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
50 సీసీటీవీల విశ్లేషణ అనంతరం ఈ దారుణానికి సంజయ్ అలియాస్ శుభం దీక్షిత్(27) అనే యువకుడు పాల్పడినట్లు నిర్ధరించారు. తెల్లవారుజామున దీక్షిత్ భవనం దగ్గరకు వచ్చాడు. అక్కడ ఉన్న ఓ స్కూటర్ పెట్రోల్ ట్యాంకులో నిప్పుపెట్టాడు. దీంతో మంటలు పార్కింగ్ ప్రాంతమంతా అలముకొని మొత్తం భవనాన్నే కబళించాయి. ఫ్లాట్లలో నివాసముంటున్న వారు ఊపిరి ఆడక మంటల్లో కాలి బూడిదయ్యారు. కొందరు ప్రాణాలకు తెగించి బాల్కనీ, కిటీకీల్లోంచి దూకేశారు. వీరికి తీవ్ర గాయాలయ్యాయి. మంట పెట్టిన దీక్షిత్ మళ్లీ ఓ గంట అనంతరం భవనం దగ్గరకు వచ్చి సమీపంలోని సీసీటీవీలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు. వీలుకాకపోవడం వల్ల పరారయ్యాడు. ఆ యువకుడు ప్రేమించిన యువతి సురక్షితంగా ఉందని పోలీసులు తెలిపారు.
"ముందుగా ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్లు కనిపించింది. కానీ, సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా భవనం పార్కింగ్ ప్రాంతంలో ఉన్న ఓ వాహనాన్ని ఓ వ్యక్తి తగలబెట్టినట్లు తెలిసింది. మంటలు మూడంతస్తులకు వ్యాపించాయి. ఝాన్సీకి చెందిన నిందితుడు ఆరు నెలల క్రితం ఇదే భవనంలో రెంటుకు ఉండి ఖాళీ చేశాడు. ఇదే భవనంలో ఉండే ఓ యువతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ, ఆమె మరో వ్యక్తిని చేసుకునేందుకు సిద్ధమైంది. ఆమెపై ఆగ్రహంతో వేధింపులకు పాల్పడ్డాడు. గతంలో రూ.10వేల కోసం ఇరువురి మధ్య గొడవ జరిగింది. మంటలు వ్యాపించినప్పుడు ఆ యువతి ఇంట్లోనే ఉంది. ప్రస్తుతం ఆమె సురక్షితంగా ఉంది. నిందితుడి గురించి ఆమెతో పోలీసులు మాట్లాడారు."
- హరినారాయణ్ చారి మిశ్రా, ఇందోర్ పోలీస్ కమిషనర్.
నిందితుడు దీక్షిత్‌పై 302, 436 వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు కమిషనర్ హరినారాయణ్ చారి. మరోవైపు.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
నిందితుడి అరెస్ట్: ప్రేమకు నిరాకరించిందనే కారణంతో మూడంతస్తుల భవనానికి నిప్పుపెట్టిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. లోహమండి ప్రాంతంలో తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి పరారయ్యేందుకు నిందితుడు సంజయ్ దీక్షిత్ ప్రయత్నించాడని, రోడ్డు మధ్యలోని డివైడర్‌ను దాటే ప్రయత్నంలో పడిపోయి గాయపడినట్లు అధికారులు తెలిపారు. అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు.. దీక్షిత్ చేతులు, కాళ్ల నుంచి రక్తం కారుతూ స్ట్రెచర్‌పై తీసుకెళ్తున్న ఓ వీడియో వైరల్‌గా మారింది.
ఇదీ చూడండి: నీటి మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి