IndiGo bars specially abled child: దివ్యాంగుడైన ఓ చిన్నారిని ఇండిగో సంస్థ విమానంలోకి రానివ్వని ఘటన రాంచీలో చోటుచేసుకుంది. చిన్నారి బాగా భయపడుతుండటం వల్ల అతని ప్రయాణానికి నిరాకరించినట్లు విమానయాన సంస్థ తెలిపింది. అయితే.. ఇది కాస్తా సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో ఇండిగోపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలేం జరిగిందంటే..: హైదరాబాద్ వెళ్లేందుకు గత శనివారం దివ్యాంగ చిన్నారితో కలిసి ఓ కుటుంబం రాంచీ విమానాశ్రయానికి వచ్చింది. అయితే ఆ బాలుడు విమానం ఎక్కేందుకు ఇండిగో సిబ్బంది నిరాకరించారు. చిన్నారి భయాందోళనతో ఉన్నాడని.. దాని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో చిన్నారిని ఎక్కనివ్వలేదు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కూడా ప్రయాణాన్ని విరమించుకున్నారు.
ఈ ఘటన గురించి మనీషా గుప్తా అనే తోటి ప్రయాణికురాలు తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. చిన్నారిని అడ్డుకున్న ఇండిగో సిబ్బంది అతడి తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు. ఇది చాలా అమానవీయ ఘటన అని రాసుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారం కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు ఇండిగోపై విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో విమానయాన సంస్థ స్పందించింది. "భయంతో ఉన్న ఆ చిన్నారి స్తిమితపడితే విమానం ఎక్కించడానికి చివరి నిమిషం దాకా గ్రౌండ్ సిబ్బంది వేచి చూశారు. కానీ ఫలితం లేకపోయింది" అని ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. అనంతరం ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. ఓ హోటల్‌లో వసతి సౌకర్యం కల్పించినట్లు పేర్కొంది. ఆదివారం ఉదయం వారు మరో విమానంలో గమ్యస్థానానికి చేరినట్లు తెలిపింది.
"ఉద్యోగులైనా, ప్రయాణికులైనా అందరినీ కలుపుకొని వెళ్లే సంస్థ ఇండిగో. ప్రతి నెలా మా విమానాల్లో 75 వేల మంది దివ్యాంగులు ప్రయాణాలు చేస్తుంటారు" అని ఆ సంస్థ పేర్కొంది.
స్వయంగా దర్యాప్తు చేస్తానన్న సింధియా: కాగా.. ఈ ఘటనపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇలాంటి ప్రవర్తనను ఎన్నటికీ సహించేది లేదు. ఏ వ్యక్తీకి ఇలాంటి అనుభవం జరగకూడదు. దీనిపై స్వయంగా నేను దర్యాప్తు చేపడతాను. బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం" అని ఇండిగోను హెచ్చరిస్తూ సింధియా ట్వీట్ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దర్యాప్తు ప్రారంభించిందని, సంబంధిత విమానయాన సంస్థ నుంచి నివేదిక కోరిందని అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి.
ఆ బాలుడికి ఎలక్ట్రిక్ వీల్‌ఛైర్ కొనిస్తా..: ఇండిగో సీఈఓ
ఈ ఘటనపై ఇండిగో సీఈఓ రోనోజాయ్ దత్త విచారం వ్యక్తం చేశారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లోనే తమ సిబ్బంది ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా సదరు బాలుడికి ఎలక్ట్రిక్ వీల్ ఛైర్ కొనిస్తానని తెలిపారు.
"ఆ కుటుంబాన్ని విమానంలో తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే చెక్-ఇన్, బోర్డింగ్ ప్రక్రియ చేపట్టాం. అయితే బోర్డింగ్ ఏరియా వద్ద ఆ బాలుడు భయాందోళనతో కన్పించాడు. మా కస్టమర్లకు మర్యాదపూర్వకమైన సేవలు అందించడమే మా ప్రథమ ప్రాధాన్యం. అయితే ఆ సమయంలో భద్రతా మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని తప్పనిసరి పరిస్థితుల్లో మా సిబ్బంది కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ దురదృష్టకర అనుభవాన్ని ఎదుర్కొన్న ఆ కుటుంబం పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాం. దివ్యాంగ చిన్నారుల కోసం తమ జీవితాలను అంకితం చేస్తోన్న తల్లిదండ్రులు ఈ సమాజానికి నిజమైన హీరోలు. ఆ తల్లిదండ్రుల అంకితభావానికి అభినందనగా ఆ బాలుడికి ఒక ఎలక్ట్రిక్ వీల్‌ఛైర్ కొనివ్వాలని అనుకుంటున్నాం" అని ఇండిగో సీఈఓ ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఇదీ చూడండి: బస్సులో సీక్రెట్ క్యాబిన్.. డౌట్ వచ్చి చూస్తే 2500 కిలోల వెండి..