Gujarat Election 2022 : గుజరాత్లో మినీ ఆఫ్రికాగా ప్రసిద్ధి చెందిన జంబూర్ గ్రామస్థులు తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమకు ఓటు వేసే అవకాశం కల్పించినందుకు ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. వీరి ముందు తరాలు జునాగఢ్ కోట నిర్మాణ సమయంలో పనుల కోసం వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. తొలుత రత్నపుర్లో నివసించగా తర్వాత జంబుర్కు మకాం మార్చారు. ప్రభుత్వం వీరిని సిద్ధి గిరిజన తెగగా గుర్తించింది.
ప్రయోగాత్మకంగా యానిమల్ బూత్
ఓటింగ్ శాతం పెంచేలా ఎన్నికల సంఘం ఓ ప్రయోగాత్మకంగా యానిమల్ బూత్‌ను ఏర్పాటు చేసింది. జునాగఢ్ జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ సమీపంలోనే ఓ పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ప్రజలు ఓటు వేయడానికి వచ్చిన సమయంలో శిబిరంలో ఉన్న వైద్య బృందం పశువులకు చికిత్స అందించింది.
ఓటు వేసిన సాంఖ్య యోగిలు
స్వామి నారాయణ వర్గానికి చెందిన ఆరుగురు సాంఖ్య యోగిసోదరీమణులు ఎన్నికల్లో ఓటు వేశారు. కచ్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు వేసేందుకు వృద్ధుల ఆసక్తి
గుజరాత్ తొలి దశ ఎన్నికల్లో యువకులతో పోటీపడి ఓటేశారు వృద్ధులు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేందుకు ఆసక్తి చూపించారు. అనేక మంది వృద్ధులు వీల్‌ఛైర్‌పై వచ్చి మరి ఓటేశారు. సూరత్‌లో 89 ఏళ్ల పైబడిన ఓటర్లు 62,037 మంది ఉన్నారు.
పెళ్లి దుస్తుల్లో పోలింగ్ కేంద్రానికి
తాపి జిల్లాలో ప్రపుల్ భాయ్ మోరే అనే వరుడు పెళ్లిదుస్తుల్లో వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటింగ్‌లో పాల్గొన్నాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం జరగాల్సిన తన పెళ్లిని.. ఓటింగ్‌లో పాల్గొనేందుకుగాను సాయంత్రానికి మార్చుకున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో యువ ఓటర్ల సందడి
'నన్ను తిట్టడంలో కాంగ్రెస్ నేతల పోటీ.. భాజపాకు ఓటేసి బుద్ధి చెప్పండి'