Indias Got Talent 2023 Aditya Kodmur : మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు ప్లేయింగ్ కార్డ్స్ (పేక ముక్కలు)తో మ్యాజిక్ చేస్తున్నాడు. ఒకే నిమిషంలో 18 ప్లేయింగ్ కార్డులను పుచ్చకాయలో దించి రికార్డు సృష్టించాడు. ముంబయిలో జరిగిన 'ఇండియాస్ గాట్ టాలెంట్' అనే ఓ టెలివిజన్ షోలో చైనా వ్యక్తి పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు సోలాపుర్‌కు చెందిన ఆదిత్య కోడముర్ అనే యువకుడు.
Throwing Playing Cards on Watermelon : ఆదిత్యకు చిన్నప్పటి నుంచి మెజీషియన్ కావాలని ఆసక్తి. కానీ, అందుకు అతడి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఆ తర్వాత కుమారుడి ఇష్టాన్ని అర్థం చేసుకుని సపోర్ట్ చేశారు. ఈ క్రమంలో డిగ్రీ చదువుతున్న సమయంలోనే.. ఆదిత్య ప్లేయింగ్ కార్డ్స్‌తో మ్యాజిక్ చేయడం ప్రారంభించాడు. 'ఇండియాస్ గాట్ టాలెంట్' అనే షోలో పాల్గొనేందుకు మూడేళ్ల పాటు సాధన చేశాడు. ఈ క్రమంలో ఇటీవలే జరిగిన 'ఇండియాస్ గాట్ టాలెంట్ షో'లో పాల్గొని గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు.
ప్లేయింగ్ కార్డులతో అరటి పండును కోయడం, వాటర్ బాటిల్ మూతను కింద పడేటట్లు చేయడం వంటివి ఆదిత్య చాలా సార్లు చేశాడు. ముంబయిలో 'ఇండియాస్ గాట్ టాలెంట్' షోకు మొదట 3 వేల మందిని ఆడిషన్స్ చేశారని ఆదిత్య తెలిపాడు. అలా ఎలిమినేషన్ ప్రక్రియలో 100 మందికి తగ్గించారు. అలా 50, 25,15,5.. చివరగా తనను ఎంపిక చేశారని ఆదిత్య పేర్కొన్నాడు. అంతకుముందు చైనాకు చెందిన ఓ వ్యక్తి ఒక నిమిషంలో 17 ప్లేయింగ్ కార్డులను పుచ్చకాయలో దించాడు. దాదాపు 9 ఏళ్లుగా ఉన్న ఈ రికార్డును ఇటీవల ఆదిత్య బద్దలు కొట్టాడు.
"నేను గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడం పట్ల చాలా ఆనందంగా ఉన్నాను. నా తల్లిదండ్రులు నన్ను బాగా ప్రోత్సహించారు. ఇండియాస్ గాట్ టాలెంట్ అనే టీవీ షోలో పాల్గొనడానికి పలు దశల్లో ఆడిషన్స్ జరిగాయి. ఇందులో సెలెక్ట్ అయ్యినవారిలో ఎవరిని టీవీలో చూపించాలని మరో ఆడిషన్ నిర్వహించారు. టాప్ 9లో ఉన్నవారిని సెలెక్ట్ చేశారు. అందులో ఆన్లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలో మూడు సార్లు ఆడిషన్ చేసి నన్ను ఎంపిక చేశారు. ఇన్ని కఠిన పరీక్షలను దాటుకుని ముందుకు వచ్చాను."
-ఆదిత్య కొడముర్, గిన్నిస్ రికార్డు సాధించిన యువకుడు
ప్రపంచ రికార్డులే లక్ష్యం!
కాగా.. తన తదుపరి లక్ష్యం.. 'అమెరికాస్ గాట్ టాలెంట్', 'ఆసియాస్ గాట్ టాలెంట్' వంటి టెలివిజన్ షోల్లో పాల్గొని రికార్డులు నెలకొల్పడమేనని చెబుతున్నాడు ఆదిత్య.
గుండ్రటి ఈ-బైక్‌ను రూపొందించిన 64 ఏళ్ల మెకానిక్.. రూ.85వేల ఖర్చుతోనే అద్భుతం!
స్కేటింగ్‌లో 'సృష్టి' అదుర్స్.. 11ఏళ్లలో 6 గిన్నిస్ రికార్డులు.. మరో రెండు వెయిటింగ్!