కరోనా వైరస్ నిరోధానికి శాస్త్రజ్ఞులు ఏడాది వ్యవధిలోనే పలు టీకాలను కనిపెట్టడం మానవ మేధాశక్తికి అద్భుత నిదర్శనం. అదే సమయంలో ఈ విపత్కాలం ధనిక దేశాల స్వార్థ బుద్ధినీ బయటపెడుతోంది. జనవరి 18 నాటికి 49 అధికాదాయ దేశాల్లో మూడు కోట్ల 90 లక్షలమందికి కొవిడ్ టీకాలు వేయగా, పేద దేశాల్లో ఒక్క గినియాలో మాత్రమే 25 మందికి టీకాలు పడ్డాయి. ఇది నైతిక భ్రష్టత్వానికి పరాకాష్ఠ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనొమ్ ఘబ్రెయెసస్ ఆక్రోశించారు.
జనవరి 21 నుంచి భారత్ బడుగు దేశాలకు, పొరుగు దేశాలకు టీకాల సరఫరా ప్రారంభించింది. భారత్ ఔదార్యాన్ని డబ్ల్యూహెచ్‌ఓ, అమెరికాలతోపాటు పలు ప్రపంచ దేశాల నాయకులు ప్రశంసించారు. భారత్ తమకు సంజీవనిలా టీకాను పంపిందంటూ బ్రెజిల్ అధినేత బొల్సెనారో ధన్యవాదాలు తెలిపారు. చైనా ఆరోగ్య సిల్క్‌రూట్ అంటూ ఆగ్నేయాసియా, పాకిస్థాన్, గల్ఫ్, ఆఫ్రికా దేశాల్లో పలుకుబడి పెంచుకోవడానికి- వ్యాక్సిన్ రాజకీయాలు చేపట్టింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండొనేసియా, బ్రెజిల్, బొలీవియా, పెరూ తదితర దేశాల్లో చైనా వ్యాక్సిన్లను ప్రజలకు ప్రయోగాత్మకంగా వేస్తున్నారు. మొత్తం అయిదు కరోనా టీకాలను తయారు చేశామంటూ వాటిని అమ్ముకోవడానికి చైనా కొన్ని నెలల నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టింది. మయన్మార్, కంబోడియా, ఫిలిప్పీన్స్‌లకు టీకాలను విరాళంగా ఇస్తానని ప్రకటించింది. జనవరి చివరికల్లా పాకిస్థాన్‌కూ అయిదు లక్షల డోసులను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది.
కుదురుతున్న ఒప్పందాలు
మరోవైపు భారత్ సుహృద్భావపూర్వక వ్యాక్సిన్ దౌత్యాన్ని చేపట్టి బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్దీవులకు ఉచితంగా 32 లక్షల టీకా డోసులు పంపింది. భారత్‌కు ఇటీవల నేపాల్, బంగ్లాదేశ్‌లతో ఏర్పడిన పొరపొచ్చాలను సరిదిద్దడానికి టీకా దౌత్యం ఉపయోగపడుతుందేమో చూడాలి. భారత్ త్వరలో సెషెల్స్, అఫ్గానిస్థాన్, మారిషస్, శ్రీలంకలకూ టీకాలు పంపనుంది. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పూర్వ సోవియట్ రిపబ్లిక్‌లకూ పంపేందుకు ఒప్పందాలు కుదురుతున్నాయి. మొత్తం 92 దేశాలు భారత టీకాలపై ఆసక్తి చూపుతున్నాయి. వీటిలో కొన్ని దేశాలకు గ్రాంట్ల కింద, మిగతా దేశాలకు వాణిజ్య ప్రాతిపదికన సరఫరాకు ఒప్పందాలు కుదురుతున్నాయి. మార్చిలో వాణిజ్య స్థాయిలో టీకాల ఎగుమతి ప్రారంభం కావచ్చు.
పాశ్చాత్య దేశాలు రూపొందించిన ఫైజర్-బయోఎన్ టెక్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ (కోవిషీల్డ్) టీకాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భారత్ బయోటెక్-ఐసీఎంఆర్‌ల కోవాగ్జిన్ టీకా సామర్థ్యాన్ని విఖ్యాత వైద్య పత్రిక లాన్సెట్ ధ్రువీకరించింది. ఈ నెల 16 నుంచి భారీస్థాయిలో కొవిడ్ టీకా కార్యక్రమం చేపట్టిన భారత్, వేసవి నాటికి 30 కోట్లమందికి టీకాలు వేయాలని నిశ్చయించింది.
తొలినాళ్లలోనూ....
చైనా సరఫరా చేసిన సైనోవ్యాక్ టీకా సామర్థ్యం 50.4 శాతమేనని బ్రెజిల్ ప్రకటించినప్పటి నుంచి, బీజింగ్ రూపొందించిన అయిదు కొవిడ్ టీకాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా విరుచుకుపడిన తొలినాళ్లలో చైనా సరఫరా చేసిన మాస్కులు, పీపీఈ కిట్లు లోపభూయిష్ఠమని తేలడం గుర్తుంచుకోవాలి. భారత్ అప్పట్లో 150 దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్, రెమ్‌డెసివిర్, పీపీఈలు, టెస్ట్ కిట్లు పంపి అందరి మన్ననలూ చూరగొంది. గతంలోనూ భారత్ చవకగా హెచ్‌ఐవీ జనరిక్ మందులను ఆఫ్రికా దేశాలకు సరఫరా చేసింది.
ప్రపంచంలో వివిధ టీకాలకు ఉన్న డిమాండులో 62 శాతాన్ని తీరుస్తున్న భారత్, కరోనా టీకాలను కొన్ని దేశాలకు ఉచితంగా సరఫరా చేసింది. అదే చైనా తన సైనోవ్యాక్ టీకాను పరీక్షిస్తున్న దేశాలను ప్రయోగ ఖర్చులు పంచుకోవాలని కోరింది.
వ్యాక్సిన్ జాతీయవాదం
ధనిక దేశాలు వ్యాక్సిన్ జాతీయవాదానికి, ఇజ్రాయెల్ వ్యాక్సిన్ దుర్విచక్షణకు పాల్పడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విమర్శిస్తోంది. తన పౌరుల్లో నాలుగో వంతుకు ఇప్పటికే టీకాలు వేసిన ఇజ్రాయెల్ తాను ఆక్రమించిన ప్రాంతాల్లోని పాలస్తీనా అరబ్బులకు మాత్రం తరవాత వేస్తానంటోంది. ధనిక దేశాలు కరోనా టీకాలను పెద్దయెత్తున నిల్వ చేసుకుంటూ, పేద దేశాలకు అవి సకాలంలో దక్కకుండా చేస్తున్నాయి. దీంతో ప్రపంచ ప్రజలందరికీ టీకాలు వేసే కార్యక్రమం పూర్తి కావాలంటే 2023 వరకు ఆగాల్సి వస్తుంది. ఆలోపు కొవిడ్ మరింత విస్తృతంగా వ్యాపిస్తే, ప్రపంచాన్ని దీర్ఘకాలంపాటు ఆర్థిక కడగండ్లు పీడించే ప్రమాదం ఉంది.
కొవిడ్ టీకాలను ఉత్పత్తి చేసే ధనిక దేశాలు టీకాలు మొదట తమ పౌరులందరికీ అందాలని భీష్మిస్తూ వాటి ఎగుమతులపై ఆంక్షలు విధించాయి. భారత ప్రభుత్వం అన్ని దేశాలకూ వ్యాక్సిన్లు సరఫరా చేయడానికి కట్టుబడి ఉంది. అంతర్జాతీయ పథకం కోవాక్స్ కింద ఫిబ్రవరి నుంచి పేద దేశాల ప్రజలకు 200 కోట్ల డోసుల టీకాలు వేయాలని, అవసరమైతే మరో 100 కోట్ల డోసులు సేకరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీర్మానించింది. కానీ, ధనిక దేశాల స్వార్థ ధోరణి వల్ల కోవాక్స్ సకాలంలో ప్రారంభమయ్యే అవకాశం కనిపించడం లేదు. వ్యాక్సిన్లు, మందుల విషయంలో మేధా హక్కులను తాత్కాలికంగా పక్కన పెట్టాలని భారత్, దక్షిణాఫ్రికా దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)ను కోరాయి. అలా చేస్తే బడుగు దేశాలకు కొవిడ్ మందులు, టీకాలు విరివిగా సరసమైన ధరలకు లభిస్తాయి. ఇందుకు అమెరికాతోపాటు అన్ని సంపన్న దేశాలూ కలిసి రావాలి!
- కైజర్ అడపా