ఉత్తరధ్రువం.. సాహసికుల కల. అలాంటి ఉత్తరధ్రువాన్ని విమానంలో చేరుకుని తమ కలని నిజం చేసుకుంటున్నారు కెప్టెన్ జోయా అగర్వాల్ నేతృత్వంలోని మహిళా బృందం. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం... అపారమైన అనుభవం ఉన్న పైలట్లకు మాత్రమే దక్కే ఈ అరుదైన అవకాశాన్ని ఈసారి మహిళా బృందం సొంతం చేసుకోవడం విశేషం. బోయింగ్ 777 విమానంలో ఉత్తరధ్రువం మీదుగా శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు చేరుకునే ఈ బృందం... తమ సాహసాలతో బోలెడు రికార్డులని మూటకట్టుకోవాలని చూస్తోంది. అందులో మొదటిది 16,000 కిలోమీటర్ల సుదీర్ఘ, నాన్‌స్టాప్ ప్రయాణం. రెండోది ప్రపంచంలోనే రెండో పొడవాటి బోయింగ్ విమానాన్ని ఈ ప్రాంతంలో నడపడం. ఇదేం సాధారణ విషయం కాదు. ఆ బాధ్యతని కెప్టెన్ జోయా అగర్వాల్, ధైర్యంగా తీసుకుంది.
ఎనిమిది వేల గంటల ఫ్లైయింగ్ అవర్స్‌తో పాటూ బోయింగ్ విమానాన్ని అత్యంత చిన్నవయసులోనే నడిపిన రికార్డు ఆమె పేరిట ఉంది. ఆమెతో పాటూ పైలట్‌గా చక్కని అనుభవం ఉన్న తెలుగు అమ్మాయి పాపగారి తన్మయి, ఆకాంక్ష, శివానీ వంటి ఆరితేరిన పైలట్లు ఈ బృందంలో ఉన్నారు. 'కొవిడ్ తర్వాత నైరాశ్యంలో ఉన్న ప్రపంచానికి మేం చేసే ఈ సాహసం ఓ స్ఫూర్తి కావాలనుకుంటున్నాం. ఉత్తరధ్రువాన్ని మ్యాప్‌లో కూడా చూడలేని వారు ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని కలలుకనేవారూ ఉంటారు. మాకీ అవకాశం రావడం గొప్ప విషయం. మొత్తం 16000 కిలోమీటర్ల దూరం. వాతావరణం అనుకూలిస్తే 17 గంటల్లోనే బెంగళూరు చేరుకుంటాం. కాకపోతే ఈ ప్రాంతంలో శీతగాలులు లేదా వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల వాతావరణ కల్లోలాలు ఏర్పడటానికి అవకాశం ఉంది. ఆ ముప్పుని దృష్టిలో పెట్టుకుని మేం దానికి తగ్గట్టుగా ప్రత్యేక శిక్షణ తీసుకున్నాం. సరిగ్గా ఉత్తరధ్రువ ప్రాంతంలో కంపాస్‌లోని ముల్లు ఎలా నిలిచి ఉంటుందో చూడాలని నా కోరిక' అంటోంది కెప్టెన్ జోయా. ‘భౌగోళికంగా బెంగళూరుకు ఆవలివైపు శాన్‌ఫ్రాన్సిస్కో ఉంది. ఉత్తరధ్రువం మీదుగా ప్రయాణించడం వల్ల భవిష్యత్తులో సమయం, ఇంధనం ఆదా చేయడానికి గల అవకాశాలని విమానయాన సంస్థలు పరిశీలించడానికి మా ప్రయాణం సహకరిస్తుంది’ అని అంటోంది కెప్టెన్ తన్మయి.
ఇదీ చదవండి:'అంతర్జాతీయ వ్యవస్థ వృద్ధిలో ఆత్మనిర్భర్ కీలక పాత్ర'