భారతీయ రైల్వేను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. రైల్వేకు 'డిమాండ్ ఫర్ గ్రాంట్స్' అంశంపై లోక్సభలో మాట్లాడిన ఆయన.. సమర్థమైన పనితీరు కోసం ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం అందించాలని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పనిచేస్తేనే దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందని పేర్కొన్నారు. తద్వారా ఉద్యోగావకాశాలు పెరుగుతాయని చెప్పారు.
"భారతీయ రైల్వేను ఎప్పటికీ ప్రైవేటీకరించం. రైల్వే ప్రతి ఒక్క భారతీయుడి ఆస్తి. ఇది ఇలాగే కొనసాగుతుంది. రైల్వేను ప్రైవేటీకరిస్తున్నారంటూ మాపై ఆరోపణలు చేస్తున్నారు. కానీ రోడ్లపై ప్రభుత్వ వాహనాలే నడవాలని ఎవరూ అనరు. ప్రైవేటు, ప్రభుత్వ వాహనాలు రెండూ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడతాయి. రైల్వేలో ప్రైవేటు పెట్టుబడులను స్వాగతించాలి. దాని వల్ల సేవలు మెరుగవుతాయి."
-పీయూష్ గోయల్, రైల్వే శాఖ మంత్రి
2019-20 సంవత్సరంలో రైల్వేలో రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు గోయల్. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులను రూ. 2.15 లక్షల కోట్లకు పెంచినట్లు వెల్లడించారు.
ప్రయాణికుల భద్రతపై రైల్వే శాఖ తీవ్రంగా శ్రమిస్తోందని చెప్పారు గోయల్. గత రెండేళ్లలో రైలు ప్రమాదాల్లో ఒక్క ప్రయాణికుడు కూడా మరణించలేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'ప్రైవేటీకరించడమంటే.. దేశ ఆర్థిక భద్రతపై రాజీ పడటమే'