Presidential Election: దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికకు సమయం ఆసన్నమైంది. 2017లో 15వ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం జూన్ 7వ తేదీన షెడ్యూల్ విడుదల చేసింది. అప్పటి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నసీం అహ్మద్ జైదీ తేదీలను ప్రకటించారు. ఆ ఏడాది జూన్ 14 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 28వ తేదీతో ముగిసింది. జులై 17న పోలింగ్, 20న కౌంటింగ్ జరిగింది. జులై 25వ తేదీన రామ్‌నాథ్ కోవింద్‌తో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహార్ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయించారు. అప్పట్లో జూన్ 19న భాజపా నాయకత్వం రామ్‌నాథ్ కోవింద్‌ను ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం కోవింద్ పేరును అప్పటి భాజపా అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. 6వ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నుంచి బాధ్యతలు చేపట్టిన వారందరూ జులై 25వ తేదీనే ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదల చేయవచ్చన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
రాష్ట్రపతి ఎన్నికకు పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్ జారీచేయకూడదు. ఓటేయడానికి, గైర్హాజరు కావడానికి ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పటివరకూ ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ఓటింగ్ బ్యాలట్ పేపర్ విధానంలో జరుగుతుంది. ఓటింగ్ చేయాల్సిన పెన్నును కేంద్ర ఎన్నికల సంఘమే ఇస్తుంది. ఆ పెన్నుతోనే ఓటేయాల్సి ఉంటుంది. వేరే దాంతో వేస్తే అది రద్దవుతుంది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీ మొత్తం ఓట్ల విలువలో ఎన్డీయేకి 49%, యూపీఏకు 24.02%, ఇతర పార్టీలకు 26.98% బలం ఉంది. గతంలో కంటే ఈ సారి ఎన్డీఏ బలం కొంత ఎక్కువగానే ఉంది. గతంలో ఎన్డీఏ కూటమి పార్టీలతోపాటు, బయట నుంచి ఏఐఏడీఎంకే, వైకాపా, జేడీయూ, బీజేడీ, తెరాస, ఐఎన్‌ఎల్‌డీ, స్వతంత్రులు మద్దతివ్వడంతో రామ్‌నాథ్ కోవింద్‌కు 7,02,044 (65.65%) ఓట్లు, యూపీఏ అభ్యర్థి మీరాకుమార్‌కు 3,67,314 (34.35%) ఓట్లు వచ్చాయి. క్రితంసారి తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, ఆర్‌జేడీ లాంటి పార్టీలు యూపీఏ అభ్యర్థికి మద్దతిచ్చాయి. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదు. ఈ ఎన్నికల్లో కూటములు ప్రకటించే అభ్యర్థులను బట్టి తటస్థ పార్టీలు రాజకీయ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. క్రితంసారి రెండు కూటములూ దళిత అభ్యర్థులనే రంగంలోకి దింపాయి. ఈ సారి ఏ సామాజిక, ప్రాంత సమీకరణాన్ని అనుసరిస్తాయి అన్నది తెలియడం లేదు.
ఇవీ చూడండి: రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపెవరిదో? విపక్షాలు కలిసి నడిస్తే విజయం తథ్యం!