Indian Missile in Pakistan: భారత్‌లోని వాయుసేన స్థావరం నుంచి బుధవారం పొరపాటున ప్రయోగించిన క్షిపణిని పాక్ ఏ దశలోనూ గుర్తించలేకపోయిందని పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఐఏఎఫ్‌కు చెందిన ఓ అనుబంధ రహస్య బేస్‌లో దీనికి సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా.. పొరపాటున ఫైర్ అయింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ వర్గాలు ధ్రువీకరించాయి. హరియాణాలోని సిర్సా నుంచి రాజస్థాన్‌లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజి వైపు ప్రయోగించినట్లు పాక్ చెబుతున్న వాదనకు.. భారత రక్షణ శాఖ వాదన పూర్తి భిన్నంగా ఉంది.
రక్షణ శాఖ వర్గాల కథనం ప్రకారం "క్షిపణి పరీక్షకు ముందు ఎలాంటి నోటామ్ (నోటిస్ టు ఎయిర్‌మెన్) జారీ చేయలేదు. ఇది జారీ చేయకుండా ఎటువంటి పరీక్షలు నిర్వహించరు. ఎందుకంటే క్షిపణి గాల్లోకి లేచాక దాని మార్గంలోకి విమానాలు వస్తే ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అయినా, భారత్ క్షిపణులకు సంబంధించిన పరీక్షలను తూర్పు తీరంలో నిర్వహిస్తుంది. అంతేకాదు ఈ క్షిపణి సిర్సా నుంచి గాల్లోకి ఎగరలేదు" అని వెల్లడించాయి. రక్షణ శాఖ వివరాలను బట్టి ఈ పరీక్ష చేపట్టే ఉద్దేశం భారత్‌కు లేదని అర్థమవుతోంది.
పొరపాటున ఎలా ప్రయోగించారు..?
క్షిపణి ప్రయోగానికి సంబంధించి ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా.. మెకానికల్, సాఫ్ట్‌వేర్ పరంగా పలు జాగ్రత్తలు తీసుకొంటారు. క్షిపణిలో పలు లక్ష్యాలకు సంబంధించిన జియో లొకేషన్స్ ముందే ఉంటాయి. ప్రయోగానికి ముందు వీటిని సెలక్ట్ చేసుకోవడమో.. కొత్తవి యాడ్ చేసుకోవడమో చేయాలి. ఇక కౌంట్‌డౌన్ మొదలు కావడానికి ముందే పలు దశల్లో కోడ్స్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
పాక్‌కు సమాచారం అందించిన భారత్..
క్షిపణిని పొరపాటుగా ప్రయోగించిన వెంటనే పరిణామాలను విశ్లేషించి.. భారత్ ఆ సమాచారాన్ని వెంటనే పాక్‌కు అందజేసింది. అయితే.. గురువారం రాత్రి పాకిస్థాన్ సైన్యం ప్రతినిధి బాబర్ ఇఫ్తికార్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. శుక్రవారం మరో ప్రకటన విడుదల చేసి.. భారత్ తమకు ఎలాంటి సమాచారం అందించలేదని ఆరోపించారు. మరోపక్క క్షిపణి ప్రయోగం నుంచి అది కూలేవరకు తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ట్రాక్ చేసిందని పాక్ వెల్లడించింది. కానీ, భారత్ బుధవారం సాయంత్రం పొరపాటున క్షిపణి ప్రయోగిస్తే.. పాక్ గురువారం రాత్రి ప్రెస్‌మీట్ నిర్వహించింది. అంటే దాదాపు 24 గంటల తర్వాత వెల్లడించింది. మళ్లీ శనివారం.. క్షిపణి ప్రయాణ మార్గం, ట్రాజెక్టరీ వంటి వివరాలు ఇవ్వాలని భారత్‌ను కోరడం గమనార్హం. దీన్ని బట్టి పాక్ ఏ దశలోనూ క్షిపణిని ట్రాక్ చేయలేదని తెలుస్తోంది.
ఇదీ చూడండి: పాక్ భూభాగంలోకి దూసుకెళ్లిన భారత క్షిపణి.. అసలేమైంది?