చెవిటి, మూగ యువతి గీత..పొరపాటున సరిహద్దు దాటి పాకిస్థాన్‌కు వెళ్లింది. అక్కడే కొన్ని సంవత్సరాల పాటు ఆశ్రయం పొంది..అప్పటి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ చొరవతో భారత్‌కు చేరుకుంది. ఈ క్రమంలో తల్లిదండ్రుల కోసం ఆమె చేసిన ఐదేళ్ల అన్వేషణకు ముగింపు దొరికినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ కథనాల్లో వాస్తమెంత..?ఆ అన్వేషణ ఫలించిందా..?వివరాల్లోకి వెళ్తే..
పాకిస్థాన్‌కు చెందిన మీడియా సంస్థ ఆ దేశంలోని ఈదీ ఫౌండేషన్ వెల్లడించిన వివరాలను ప్రచురించింది. ఈ ఈదీ ఫౌండేషన్‌లోనే గీత ఆశ్రయం పొందిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ గీత ఆ సంస్థతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రమంలో బిల్కీస్ ఈదీ మాట్లాడుతూ..'గీతతో ఇప్పటికీ మా అనుబంధం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఆమె మాకు శుభవార్త చెప్పింది. తన కన్నతల్లిని కలుసుకున్న సంతోషాన్ని వ్యక్తం చేసింది. తన అసలు పేరు రాధ వాగ్మరే అని..మహారాష్ట్రలోని నైగావ్ గ్రామంలో తన కన్నతల్లిని గుర్తించినట్లు చెప్పింది' అని వెల్లడించారు. బిల్కిస్ ఈదీ పేరుపొందిన ఈదీ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు అబ్దుల్ సత్తార్ ఈదీ సతీమణి. 2016లో అబ్దుల్ సత్తార్ మరణించారు.
గీత చిన్నవయసులో తమకు కరాచిలోని రైల్వే స్టేషన్‌లో ఒంటరిగా కనిపించిందని బిల్కిస్ తెలిపారు. 'ఈదీ ఫౌండేషన్‌లో ఆమె ఆలనాపాలనా చూసుకున్నాం. మొదట తనకి ఫాతిమా అని పేరుపెట్టాం. తను హిందువని గుర్తించి, గీతగా పేరు మార్చాం. సంజ్ఞలతో మేం ఆమెతో సంభాషించేవాళ్లం' అని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. గీత గురించి తెలిసిన అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్..ఆమెను భారత్‌కు తీసుకువచ్చి, ఆమె కుటుంబంతో కలిపేందుకు ప్రయత్నించారు. 2015 నుంచి ఆ అన్వేషణ కొనసాగుతూనే ఉంది. చాలామంది గీత తమ బిడ్డే అంటూ ముందుకొచ్చారు కూడా. అయితే అవేవీ ఫలించలేదు. తాజా పరిణామంపై డీఎన్‌ఏ ఫలితాలు ఏం చెప్తాయో చూడాలి!