రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం అంశంపై ఆరోపణలను భారత్‌కు చెందిన డెఫ్‌సిస్ సంస్థ ఖండించింది. ఆ జెట్లకు సంబంధించిన 50 డమ్మీ నమూనాలను తాము దసో ఏవియేషన్ సంస్థకు సరఫరా చేశామని తెలిపింది. ప్రాన్స్ కు చెందిన 'మీడియాపార్ట్' అనే పోర్టల్‌లో వచ్చిన కథనం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. కానుకలుగా ఇవ్వడం కోసం రఫేల్ డమ్మీ నమూనాలను తయారు చేసేందుకు డెఫ్‌సిస్‌కు 10 లక్షల యూరోలను రఫేల్ తయారీ సంస్థ దసో ఏవియేషన్ చెల్లించినట్లు కథనం తెలిపింది. అయితే.. ఈ నమూనాలు తయారైనట్లుగా, తాను అందుకున్నట్లుగా కానీ ఆ సంస్థ ఆధారాలు చూపలేకపోయిందని ఫ్రాన్స్ అవినీతి నిరోధక విభాగం తనిఖీదారులు చెప్పారని పేర్కొంది. అది రహస్య ఆర్థిక లావాదేవీని ఏమార్చేందుకు సాగించిన బోగస్ కొనుగోలుగా.. వారు అంచనాకు వచ్చారని మీడియాపార్ట్ పేర్కొంది.
ఈ కథనంపై డెఫ్‌సిస్ మంగళవారం స్పందించింది. తమకు అందిన కొనుగోలు ఆర్డర్ ప్రకారం 50 డమ్మీ నమూనాలను దసో సంస్థకు సరఫరా చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన చలానాలు ఈ-వే బిల్లులు, జీఎస్టీ రిటర్న్‌లను సంబంధిత అధికారులకు సమర్పించినట్లు పేర్కొంది.
ఇవీ చూడండి: రఫేల్ ముడుపులపై రాజకీయ రగడ