Indian Farmer Released by Bangladesh: పది నెలల క్రితం బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా సిబ్బంది నిర్బంధించిన ఇద్దరు త్రిపుర రైతులు విడుదల అయ్యారు. తమ ఇళ్లకు చేరుకున్నారు. దీనిపై ఆ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మేవాడ్ కుమార్ జమాటియా హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విలేకరులతో మాట్లాడిన జమాటియా.. బంగ్లాదేశ్‌లోని మౌల్విబజార్ జిల్లాలో 10 నెలల జైలు జీవితం గడిపిన రైతులు గురుపాద దెబ్బర్మ, రాజీవ్ దెబ్బర్మ విడుదలయ్యారని చెప్పారు.
"గురుపాద, రాజీవ్‌లను బంగ్లాదేశ్ అధికారులు విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ దేశంలోని మౌల్విబజార్ జిల్లాలో 10 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఖోవై జిల్లాకు చెందిన ఈ రైతులు సాగు అవసరాల కోసం కొన్నిసార్లు ఫెన్సింగ్‌ను దాటాల్సి వచ్చేది. పొరపాటు పడ్డ బంగ్లాదేశ్ సరిహద్దు సిబ్బంది.. వారిని పట్టుకున్నారు. జైలులో పెట్టారు. వారిని విడుదల చేయాలని బంగ్లాదేశ్, భారత ప్రభుత్వాలను అభ్యర్థించాను. ఫలితంగా వారు ఈ రోజు విడుదలయ్యారు. ఇందుకు సహకరించిన ఎంపీ అబ్దుల్ సహీద్, మౌల్వీబజార్ డీసీకి నా అభినందనలు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను."
- మేవాడ్ కుమార్ జమాటియా, అసోం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
తమను విడుదల చేసినందుకు రాజీవ్ దెబ్బర్మ సంతోషం వ్యక్తం చేశాడు. భారత్, బంగ్లాదేశ్ అధికారులకు ధన్యవాదాలు తెలిపాడు. "తిరిగి ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. మమ్మల్ని స్వదేశానికి తీసుకురావడానికి రాయబార కార్యాలయం చొరవ తీసుకున్నట్లు కొన్ని నెలల క్రితం తెలిసింది. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు" అని రాజీవ్ పేర్కొన్నాడు.
ఇదీ చూడండి: 'రక్తదానం చేసిన వారికి 2కిలోల చికెన్, అరకిలో పనీర్'