ఎలాంటి ఒత్తిళ్లకు భారత్ తలొగ్గదని త్రిదళాధిపతి బిపిన్ రావత్ అన్నారు. ఉత్తర సరిహద్దుల్లో యథాతథస్థితిని నెలకొల్పేందుకు భారత్ ధృడంగా సంకల్పించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. లద్దాఖ్ ప్రాంతంలో చైనాతో తలెత్తిన వివాదాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు రావత్. దిల్లీలో జరుగుతున్న రైసీనా డైలాగ్ సమావేశంలో పాల్గొన్న ఆయన చైనా తీరుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
"సాంకేతికంగా, సైన్యం పరంగా ధృడంగా ఉందన్న నమ్మకంతో చైనా ఇతర దేశాలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. కానీ, భారత్ దీన్ని దీటుగా ఎదుర్కొంది. సాంకేతికత సాయంతో.. సైన్యాన్ని ఉపయోగించకుండా భారత్ సరిహద్దుల్లో యథాతథస్థితిని నిరోధించే ప్రయత్నం చేసింది చైనా. భారత్ ఇందుకు తలొగ్గలేదు. ప్రపంచదేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయి."
--బిపిన్ రావత్, త్రిదళాధిపతి.
ఆర్మీ దళాల ఆధునికీకరణపై మాట్లాడిన రావత్.. అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాలు పొందేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. కానీ, అమెరికా తమ సాంకేతికతను పంచుకోవడానికి సాయం చేస్తుందా? లేదా? అనే దానిపై స్పష్టత లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జపాన్ సాయుధ దళాల జాయింట్ స్టాఫ్ జెన్ కోజి యమజకి కూడా చైనాపై విమర్శలు గుప్పించారు.
ఇదీ చదవండి:'అడ్డంకులు తొలగించి టీకా ఉత్పత్తి పెంచాలి'