US Visa India : భారతీయులకు అగ్రరాజ్యం అమెరికా తీపికబురు అందించింది. ఏడాదికి దాదాపు 12 లక్షల వీసాలు మంజూరు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు.. భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం మెక్సికో, చైనాకు.. అమెరికా అత్యధికంగా వీసాలను జారీ చేస్తోంది. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న భారత్ అధిక వీసాల జారీ తర్వాత రెండో స్థానానికి వచ్చే అవకాశముందని అమెరికా భావిస్తోంది.
కరోనా నేపథ్యంలో వివిధ దేశాల వారికి వీసాల మంజూరు ప్రక్రియను.. అమెరికా కఠినతరం చేసింది. భారత్ నుంచి వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. వీసా జారీకి దాదాపు ఏడాదికిపైగా సమయం పట్టింది. అయితే ఇటీవల అమెరికా ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల.. ఈ జాప్యం 9 నెలలకు తగ్గింది. అంతకుముందు 450 రోజులుగా ఈ గడువు ఉండేది. రానున్న రోజుల్లో దీనిని మరింత తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని అమెరికా దౌత్యాధికారి తెలిపారు.
వచ్చే వేసవి నాటికి కరోనాకు ముందునాటి పరిస్థితులను తీసుకొచ్చి, తక్కువ వ్యవధిలోనే వీసా మంజూరుకు చర్యలు చేపడుతున్నట్లు అమెరికా దౌత్య కార్యాలయం తెలిపింది. వీసాల మంజూరు విషయంలో అమెరికా ప్రథమ ప్రాధాన్యం భారత్‌కేనని ఓ సీనియర్ అధికారి తెలిపారు. భారత్ నుంచి హెచ్1బీ, హెచ్ఎల్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తించినట్లు పేర్కొన్నారు. వీసా రెన్యువల్ కోసం దరఖాస్తు చేసిన వారికి లక్ష స్లాట్లు రిలీజ్ చేసినట్లు తెలిపారు. ఇంటర్వ్యూ లేకుండా వీసాలను రెన్యువల్ చేసుకునేందుకు 'డ్రాప్ బాక్స్' సౌకర్యాన్ని పెంపొందించామన్నారు. ప్రస్తుతం వ్యాపారం, పర్యాటకానికి సంబంధించిన బీ1, బీ2 వీసాలకు కూడా దాదాపు 9 నెలల సమయమే పడుతోందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: ట్విట్టర్లో డిజిటల్ చెల్లింపులు.. డెబిట్ కార్డుల జారీ.. మస్క్ నయా ప్లాన్