ఆధునిక నైనిక సాంకేతిక పరిశోధన, ఉత్పత్తి, వినియోగం విషయంలో భారత్ సాధించిన విజయాలను ఈ దఫా 'డిఫ్‌ఎక్స్‌పో'లో (Defence Expo 2022) కళ్లకు కట్టనున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ మెగా సైనిక ప్రదర్శన (Defence Expo 2022) వచ్చే ఏడాది మార్చి 11-13 మధ్య జరుగుతుందని చెప్పారు. ఇందుకు గుజరాత్‌లోని గాంధీనగర్ వేదికవుతుందని వివరించారు. ఈ కార్యక్రమానికి సన్నాహకంగా సోమవారం ఆయన దిల్లీలో పలు దేశాల రాయబారులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. గత ఐదేళ్లలో భారత ఆయుధ ఎగుమతులు 334 శాతం మేర పెరిగాయని ఆయన చెప్పారు. నేడు భారత్ 75కుపైగా దేశాలకు సైనిక సామగ్రిని విక్రయిస్తోందన్నారు. ఇది తమ ఉత్పత్తుల నాణ్యత, పోటీతత్వానికి నిదర్శనమని తెలిపారు.
ఈసారి నిర్వహించే రక్షణ ఉత్పత్తుల (Defence Expo 2022) ప్రదర్శనలో అన్ని రకాల ఆధునిక పరిజ్ఞానాలు ఒకే వేదికపైకి వస్తాయని చెప్పారు. ఏరోస్పేస్, రక్షణ పరిశ్రమలకు సంబంధించిన వారికి ఇది అపార అవకాశాలను కల్పిస్తుందన్నారు. ఆ ప్రదర్శనలో ఆయా దేశాలు పాలు పంచుకునేలా చూడాలని రాయబారులను కోరారు. దీనివల్ల రక్షణ రంగంలో పరస్పర ప్రయోజనకర బంధాలకు మార్గం సుగమమవుతుందని చెప్పారు.
రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయాల్లో తనిఖీలు
దిల్లీలోని సౌత్ బ్లాక్‌లో ఉన్న రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయాలను రాజ్‌నాథ్ సింగ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ విభాగాల్లో తిరుగుతూ పరిశుభ్రత, పని వాతావరణం వంటి అంశాలను పరిశీలించారు. ఉద్యోగులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. మార్పులు అవసరమని భావించిన చోట సూచనలు చేశారని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి : 'కొవిడ్ కొత్త కేసుల్లో టీకా తీసుకున్నవారే అధికం'