జన్యు సంబంధిత సమస్య అయిన డౌన్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తులకు ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. డౌన్ సిండ్రోమ్ ఉన్నవారు హై-రిస్క్ జాబితాలోకి వస్తారని తెలియజేసే అధ్యయన వివరాలు గతంలో లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. దీంతో అప్రమత్తమైన యూకే, యూఎస్, స్పెయిన్ వంటి దేశాలు వారికి ముందుగా టీకాలను అందించాయి. ఇప్పుడు భారత్ కూడా అదే యోచనలో ఉంది.
లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధనా వివరాల ప్రకారం.. సాధారణ వ్యక్తులతో పోలిస్తే డౌన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు మూడు రెట్లు ఎక్కువగా కరోనా ప్రభావానికి, మరణానికి గురయ్యే అవకాశాలున్నట్లు అందులో వెల్లడించారు. భారత్‌లో సంవత్సరానికి సుమారు 30 వేల డౌన్ సిండ్రోమ్ కేసులు నమోదవుతున్నాయి.
"శారీరక, మానసిక ఎదుగుదలను ఆపేసే జన్యుపరమైన సమస్య డౌన్ సిండ్రోమ్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరిగే వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో వీరికి ప్రాధాన్యం ఇచ్చేలా చూస్తాం. డౌన్ సిండ్రోమ్ ఉన్నవారిని హై-రిస్క్ జాబితాలో చేర్చాలని మా తరువాతి సమావేశంలో ప్రతిపాదిస్తాం."
-డాక్టర్ సమీరన్ పండా, జాతీయ టీకా నిపుణుల బృందంలో సభ్యుడు
డౌన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులకు కరోనా సోకితే లక్షణాలు అధికంగా ఉండటంతో పాటు, ఊపిరితిత్తుల్లో తీవ్ర సమస్యలు ఎదురవుతాయని పరిశోధనలో పాల్గొన్న ఎమోరీ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ యాంకే హ్యూల్స్ తెలిపారు.
ఇదీ చూడండి: ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా టీకా ధర రూ.250: కేంద్రం