RUSSIA-INDIA S-400 DELIVERY: భారత్‌కు ఎస్-400 ట్రయంఫ్ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థలను ముందుగా నిర్ణయించుకున్న గడువు ప్రకారమే అందజేయనున్నట్లు రష్యా తెలిపింది. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా 'ఎస్-400' సరఫరాలో జాప్యం చోటుచేసుకుంటుందేమోనని భారత్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మన దేశంలో రష్యా రాయబారి డేనిస్ అలిపోవ్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 75 ఏళ్లవుతున్న సందర్భంగా 'రష్యా డైజెస్ట్' అనే మేగజీన్‌కు ఆయన ముందుమాట రాశారు. పశ్చిమ దేశాలకు చెందిన అనేక కంపెనీలు బయటకు వెళ్లిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం తమ దేశ విపణిలో భారత వ్యాపారాలకు అవకాశాలు పుష్కలంగా అందుబాటులోకి వచ్చినట్లయిందని అందులో పేర్కొన్నారు. ఐదు యూనిట్ల ఎస్-400 వ్యవస్థల కోసం రష్యాతో భారత్ 2018 అక్టోబరులో 500 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. వాటిలో తొలి యూనిట్ అందజేత ప్రక్రియ గత ఏడాది డిసెంబరులో, రెండో రెజిమెంట్ సరఫరా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభమైంది.
ఇదీ చదవండి: