India Nepal PMs meet: భారత్-నేపాల్ మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలు చాలా ప్రత్యేకమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అలాంటి స్నేహం ప్రపంచంలో ఎక్కడా కనిపించదని పేర్కొన్నారు. నేపాల్ అభివృద్ధి ప్రయాణంలో భారత్ తోడ్పాటు అందిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు భారత పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాని షేర్ బహదుర్ దేవ్బాతో దిల్లీలో భేటీ అనంతరం ఇరువురు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా నేపాల్ హైడ్రోపవర్ అభివృద్ధి ప్రణాళికల్లో భారత కంపెనీలు భాగం కానున్నాయని మోదీ తెలిపారు. దీనిపై ఇరువురూ అంగీకారానికి వచ్చినట్లు తెలిపారు. భవిష్యత్ సహకారానికి ఈ ఒప్పందం బ్లూప్రింట్‌గా నిలుస్తుందని ఉద్ఘాటించారు. విద్యుత్ రంగంలో ఉన్న సహకారం నుంచి ఇరుదేశాలు ప్రయోజనాలు పొందాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ సౌర కూటమిలో నేపాల్ చేరడాన్ని స్వాగతించారు.
ఈ సందర్భంగా నేపాల్‌లో రూపే కార్డు సేవలను ఇరువురు దేవ్బాతో కలిసి మోదీ ప్రారంభించారు. సోలు పవర్ ట్రాన్స్మిషన్ లైన్‌ను ఆవిష్కరించారు. రైల్వే, విద్యుత్ వంటి రంగాల్లో సహకారం పెంపొందించుకునేందుకు నాలుగు ఒప్పందాలను ఖరారు చేసుకున్నారు. 'నేపాల్ మిగులు విద్యుత్‌ను.. భారత్‌కు ఎగుమతి చేయడం చాలా సంతోషించే విషయం. దీని వల్ల నేపాల్ ఆర్థికానికీ ప్రయోజనం కలుగుతుంది. నేపాల్ హైడ్రోపవర్ అభివృద్ధి ప్రాజెక్టుల్లో మరిన్ని భారత కంపెనీలు భాగం కానున్నాయి. నేపాల్‌లో రూపే కార్డు సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా.. ఇరుదేశాల ఆర్థిక అనుసంధానతలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికినట్లైంది' అని మోదీ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
'మోదీ నేతృత్వంలో భారత వృద్ధి భేష్!'
India Nepal rail link: బిహార్‌లోని జయ్నగర్ నుంచి నేపాల్‌లోని కుర్తా మధ్య బ్రాడ్‌గేజ్ మార్గంలో నడిచే తొలి ప్యాసింజర్ రైలును మోదీ, దేవ్బా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేపాల్ ప్రధాని.. భారత్, నేపాల్ మధ్య మెరుగైన సంబంధాలు ఉండటం అత్యంత ముఖ్యమని అభిప్రాయపడ్డారు. మోదీతో చర్చలు ఫలప్రదంగా సాగాయని చెప్పారు. సరిహద్దు సమస్యను ద్వైపాక్షిక మార్గాల ద్వారా పరిష్కరించాలని ప్రధాని మోదీని కోరినట్లు తెలిపారు. 'మోదీ నేతృత్వంలో భారత్ సాధిస్తున్న పురోగతి ప్రశంసనీయం. కొవిడ్‌పై భారత్ మెరుగ్గా పోరాడింది. నేపాల్‌కు సైతం సహకారం అందించింది. కరోనా వ్యాక్సిన్ తొలి సాయం మాకు భారత్ నుంచే అందింది. కొవిడ్‌పై పోరాడేందుకు ఔషధాలు, వైద్య పరికరాలు సైతం సరఫరా చేసింది' అని దేవ్బా పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాతో చారిత్రక ఒప్పందం..
మరోవైపు, ఆస్ట్రేలియా-ఇండియా మధ్య 'ఆర్థిక సహకారం, వర్తక అవగాహన' ఒప్పందం జరిగింది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, ప్రధాని మోదీ మధ్య జరిగిన వర్చువల్ సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డేన్ టెహాన్.. ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. తక్కువ సమయంలోనే ఈ ఒప్పందం ఖరారు కావడం.. ఇరుదేశాల మధ్య ఉన్న పరస్పర, లోతైన అవగాహన, నమ్మకానికి అద్దం పడుతోందని మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రత్యేకమైన ఘట్టంగా అభివర్ణించారు. ఈ ఒప్పందం దేశీయ ఉత్పత్తిదారులు, సర్వీస్ ప్రొవైడర్లకు ఏటా 14.8 బిలియన్ డాలర్ల వర్తక అవకాశాలను కల్పిస్తుందని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ చెప్పారు. ప్రపంచంలోని అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఆస్ట్రేలియా రైతులు, తయారీదారులకు అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కోట్ల మంది ప్రజలు ఉన్న భారత మార్కెట్ వీరికి అందుబాటులో ఉంటుందని చెప్పారు.
ఇదీ చదవండి: 14 అడుగుల కింగ్ కోబ్రా.. 2.5 నిమిషాల హైటెన్షన్.. చివరకు...