పాకిస్థాన్‌లోని ఖైబర్ పంఖ్తుంఖ్వా రాష్ట్రంలో హిందూ ఆలయాన్ని కూల్చివేయడంపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ కోరినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పాకిస్థాన్ విచారణ చేపడుతుందని ఆశిస్తున్నట్లు భారత్ పేర్కొందని స్పష్టం చేశారు. దర్యాప్తు వివరాలను భారత్‌తో పంచుకోవాలని కోరినట్లు వివరించారు.
పాక్‌లో మైనారిటీలపై జరుగుతున్న వరుస అకృత్యాలపైనా విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌కు ఈ మేరకు అభిప్రాయాన్ని వెల్లడించినట్లు స్పష్టం చేశాయి. మైనారిటీల భద్రతకు చర్యలు తీసుకోవడమే కాకుండా.. వారి సాంస్కృతిక వారసత్వ సంపదను కాపాడాలని కోరినట్లు తెలిపాయి.
మళ్లీ నిర్మాణం
మరోవైపు, అల్లరిమూక ధ్వంసం చేసిన మందిరాన్ని పునర్నిర్మించాలని గురువారం స్థానిక ప్రభుత్వం ఆదేశించింది. మైనారిటీల మతపరమైన స్థలాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖాన్ స్పష్టం చేశారు.
ఈ కేసులో జమైత్ ఉలేమా ఈ ఇస్లామ్ నేత రెహ్మత్ సలేమ్ ఖట్టక్ సహా 45 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎఫ్ఐఆర్లో 350 మంది పేర్లను జత చేసినట్లు చెప్పారు.
ఈ కేసుపై అక్కడి సుప్రీంకోర్టు సైతం స్పందించింది. సంబంధిత స్థానిక అధికారులు జనవరి 5న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: పాక్‌లో హిందూ ఆలయాన్ని కూల్చిన ఘటనలో 30 మంది అరెస్టు