అరుణాచల్‌ప్రదేశ్ వద్ద వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి చైనా ఓ గ్రామాన్ని నిర్మించిందంటూ అమెరికా రక్షణ శాఖ ఇటీవల ఓ నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే.. ఆ ప్రాంతం దాదాపు ఆరు దశాబ్దాలుగా చైనా సైనిక నియంత్రణలోనే ఉందని భారత సైనిక వర్గాలూ తెలిపాయి. తాజాగా విదేశీ వ్యవహారాలశాఖ ఈ విషయంపై స్పందించింది. దేశ భూభాగంలో చైనా ఆక్రమణలతోపాటు ఆ దేశ వాదనలను భారత్ ఎప్పుడూ అంగీకరించలేదని స్పష్టం చేసింది. 'దశాబ్దాల క్రితం ఆక్రమించిన ప్రాంతాలతోపాటు సరిహద్దుల్లో చైనా కొన్నేళ్లుగా నిర్మాణ కార్యకలాపాలు చేపట్టింది. కానీ.. దాని ఆక్రమణలను, వాదనలను భారత్ ఎప్పుడూ అంగీకరించలేదు' అని ఆ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం తెలిపారు. దౌత్యమార్గాల ద్వారా ఈ విషయమై ఎప్పటికప్పుడు తీవ్ర నిరసన తెలిపినట్లు, భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుందని చెప్పారు.
'పాక్ వైఖరి తేటతెల్లమవుతోంది..'
సరిహద్దుల వెంబడి స్థానిక జనాభా కోసం రోడ్లు, వంతెనల నిర్మాణంతోసహా ఆయా మౌలిక సదుపాయాల కల్పనను భారత ప్రభుత్వం సైతం ముమ్మరం చేసినట్లు బాగ్చీ తెలిపారు.
"పౌరుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు అరుణాచల్‌ప్రదేశ్‌తో సహా సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టే విషయానికి కేంద్రం కట్టుబడి ఉంది. దేశ భద్రతపై ప్రభావం చూపే పరిణామాలపై ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచుతోంది. దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది."
--అరిందమ్ బాగ్చీ
అఫ్గాన్ పరిస్థితులపై బుధవారం దిల్లీలో నిర్వహించిన ఎన్‌ఎస్‌ఏల సమావేశానికి పాక్ గైర్హాజరు కావడంపై బాగ్చీ స్పందిస్తూ.. ఇటువంటి ముఖ్యమైన సమావేశాన్ని దాటవేయడం చూస్తుంటే అఫ్గాన్ సమస్యల పట్ల పాక్ వైఖరి తేటతెల్లమవుతోందన్నారు.
ఇవీ చదవండి: