భారత గగనతలం మీదుగా వెళ్లేందుకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమానానికి అధికారులు అనుమతినిచ్చినట్లు సమాచారం. తొలిసారి శ్రీలంకలో పర్యటించేందుకు భారత్ మీదుగా వెళ్లనున్నారు.
అయితే 2019లో.. తమ గగనతలం మీదుగా సౌదీకి వెళ్లేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ విమానానికి పాకిస్థాన్ అనుమతి నిరాకరించడం గమనార్హం. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో అనుమతి ఇవ్వలేదని సాకుగా చెప్పింది. ఈ విషయంపై అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థకు భారత్ ఫిర్యాదు కూడా చేసింది.
సాధారణంగా దేశాధినేతల విమానాలకు అన్ని దేశాల ప్రభుత్వాలు అనుమతులు ఇస్తుంటాయి. మోదీ విమానానికి పాక్ అనుమతి నిరాకరించి నిబంధనలు ఉల్లంఘించింది.