తమ దేశంలో ఉగ్రవాద దాడులకు పాల్పడినట్టు భారత్‌పై ఆరోపణలు చేస్తున్న పాకిస్థాన్‌పై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. దాయాది దేశం చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. పాక్ పన్నుతున్న ఉగ్రకుట్రలు ప్రపంచ దేశాలకు తెలుసని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ విమర్శించారు. ఆ దేశ వ్యూహాల గురించి పసిగట్టవచ్చని.. ఉగ్రవాదులకు అండగా నిలిస్తున్నట్టు ఆ దేశ నాయకులే అంగీకరించారని పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో పాక్‌లో జరిగిన దాడుల వెనుక భారత్ హస్తం ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి.. తాజాగా ఓ మీడియా సమావేశంలో ఆరోపించారు. అయితే.. ఇవి అనాలోచిత వ్యాఖ్యలని చెప్పిన శ్రీవాస్తవ.. ఆధారాల్లేని వాదనలు ఎప్పటికీ విశ్వసనీయతను పొందలేవన్నారు.
అంతేకాకుండా.. సరిహద్దులో ఉగ్రవాదాన్ని సమర్థించుకొనేందుకే పాక్ ఇలాంటి వాదనలు తెరపైకి తీసుకొస్తోందని చెప్పారు శ్రీవాస్తవ. కశ్మీర్లో ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడికి పాల్పడటం, భారత భూభాగంలోకి చొరబాటు వంటి ఘటనల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ఆయన విమర్శించారు.
ఇదీ చదవండి: భారత్ నిరసనల మధ్యే 'గిల్గిత్-బాల్టిస్థాన్' ఎన్నికలు