వ్యాక్సిన్ కారణంగా దేశంలో తొలి మరణం సంభవించింది. కొవిడ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై అధ్యయనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ కమిటీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. 68 ఏళ్ల వ్యక్తి తీవ్ర ఎలర్జీ(anaphylaxis)తో మార్చి 8న ఆ వ్యక్తి మృతిచెందినట్లు జాతీయ ఏఈఎఫ్ఐ కమిటీ పేర్కొంది.
వ్యాక్సినేషన్ అనంతరం తీవ్ర దుష్ప్రభావాలకు సంబంధించిన 31 కేసులపై ప్యానెల్ అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా ఆ 68 ఏళ్ల వ్యక్తి టీకా వల్ల తలెత్తిన ప్రభావంతోనే మృతి చెందాడని ధ్రువీకరించింది.
"కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తీవ్ర ఎలర్జీ వల్ల నమోదైన మొదటి మరణం ఇది. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 30 నిమిషాలు టీకా కేంద్రంలోనే వేచి ఉండటం ముఖ్యం. చాలా వరకు ఎలర్జీలు తొలి ముప్పై నిమిషాల్లోనే సంభవిస్తాయి. సరైన చికిత్స అందిస్తే మరణాలను నివారించవచ్చు."
-డాక్టర్ ఎన్కే అరోరా, జాతీయ ఏఈఎఫ్ఐ కమిటీ ఛైర్పర్సన్
టీకా దుష్ప్రభావాలకు సంబంధించి ఫిబ్రవరి 5న ఐదు కేసులు, మార్చి 9న ఎనిమిది, మార్చి 31న 18 కేసులను కమిటీ గుర్తించింది.
ఏప్రిల్ తొలి వారం డేటా ప్రకారం టీకా దుష్ప్రభావాల వల్ల మరణాల రేటు 10 లక్షల డోసులకు 2.7గా నమోదైందని కమిటీ నివేదిక తెలిపింది. ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 10 లక్షల డోసులకు 4.8గా ఉందని తెలిపింది. అయితే, నమోదైన మరణాలన్నింటికీ టీకా కారణం కాదని స్పష్టం చేసింది. సరైన అధ్యయనం ద్వారానే టీకాకు, మరణాలకు మధ్య సంబంధం తెలుస్తుందని పేర్కొంది.
31 కేసుల్లో...
ఈ మేరకు ప్యానెల్ గుర్తించి, దర్యాప్తు చేసిన 31 కేసుల్లో 18 మరణాలు యాదృచ్ఛికంగా(టీకాకు సంబంధం లేదు) సంభవించాయని స్పష్టం చేసింది. ఏడు కేసులను సందేహాస్పద మరణాలుగా పేర్కొంది. మరో మూడు టీకా ఉత్పత్తి సంబంధిత మరణాలని తెలిపింది. మిగిలిన రెండు కేసులు వర్గీకరించలేని విధంగా ఉన్నాయని వివరించింది. వీటిపై దర్యాప్తు నిర్వహించినప్పటికీ.. కీలక సమాచారం లేని కారణంగా మరణానికి కారణాలను చెప్పలేకపోయామని వివరించింది. సంబంధిత సమాచారం అందుబాటులోకి వస్తే.. ఈ కేసుపై మరోసారి దర్యాప్తు చేస్తామని స్పష్టం చేసింది.
జనవరి 16, 19 తేదీల్లో టీకా తీసుకున్న ఇద్దరికి తీవ్ర ఎలర్జీలు తలెత్తి ఆస్పత్రిలో చేరారని నివేదికలో వెల్లడించింది. వీరిద్దరూ కోలుకున్నట్లు స్పష్టం చేసింది. టీకా తీసుకోవడం వల్ల ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని ఈ సందర్భంగా కమిటీ నొక్కి చెప్పింది.
ఇదీ చదవండి: 'టీకా బూస్టర్ డోస్‌పై ముమ్మర పరిశోధనలు'