సుదీర్ఘ ప్రతిష్టంభన తర్వాత బలగాల ఉపసంహరణకు భారత్, చైనా అంగీకరించాయి. తూర్పు లద్దాఖ్ సరిహద్దులోని పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి ఇరు దేశాల బలగాలు వెనక్కు వెళ్తాయని పార్లమెంట్లో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దీంతో దేశ ప్రయోజనాలు, సార్వభౌమత్వాన్ని కాపాడినట్లైందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ, ఈ చర్యతో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ), భారత్ వైఖరిపై ఆందోళన వ్యక్తమవుతోంది. బలగాల ఉపసంహరణతో భారత భూభాగాన్ని చైనాకు అప్పగించినట్లు అయ్యిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. దానిని కేంద్రం తోసిపుచ్చింది. అయితే రాహుల్ విమర్శలో వాస్తవమెంత? నిజంగానే చైనాపై ఒత్తిడి తీసుకురాగలిగామా? ఈ ఒప్పందంతో వెనక్కి తగ్గింది చైనానా? భారతా?
![Ladakh disengagement and the Chinese 1959 claim line](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10634753_yv.jpg)
'చైనాకే అనుకూలం..'
సైనిక ఉపసంహరణ ప్రక్రియ '1959లో చైనా పేర్కొన్న రేఖ'కు అనుగుణంగా జరుగుతోందని మాజీ లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఎస్ పనాగ్ అన్నారు. పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునే సైనిక శక్తి భారత్‌కు లేకపోవడమే అందుకు కారణమని వివరించారు.
చైనా పేర్కొన్న రేఖ అంటే?
1959లో భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు చైనా ప్రధాని చౌ ఎన్లై రాసిన లేఖతో తొలిసారి ఈ రేఖ గురించి ప్రస్తావనకు వచ్చింది. 1914 సిమ్లా ఒప్పందంలోని మెక్‌మోహన్ రేఖ నుంచి ఇది ఉద్భవించింది. దానిని తనకు అనుకూలంగా మార్చి ప్రకటించిందే ఈ 1959 రేఖ.
మెక్‌మోహన్ రేఖ భారత్, టిబెట్‌ను వేరు చేస్తుంది. అయితే సిమ్లా ఒప్పందం జరిగిన 1914 జులై 3 నాటి నుంచి 1959 జనవరి వరకు మెక్‌మోహన్ రేఖకు చైనా అభ్యంతరం తెలపకపోవడం గమనార్హం.
![Ladakh disengagement and the Chinese 1959 claim line](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10634753_yvvv.jpg)
నెహ్రూకు రాసిన ఆ లేఖలో.. "తూర్పు భాగంలో మెక్‌మోహన్ రేఖ.. పశ్చిమాన ఇరు దేశాల అధీనంలో ఉన్న ప్రాంతం నుంచి 20 కిలోమీటర్లు వెనక్కు వెళ్లాలి" అని ఎన్లై ప్రతిపాదించారు.
1959 రేఖ గురించి చైనా ప్రస్తావన..
1962 నవంబర్ 21న చైనా ఏకపక్షంగా ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందం సమయంలో 1959 ఎల్ఏసీ గురించి ఆ దేశం ప్రస్తావించింది. " 1962 డిసెంబర్ 1 భారత్, చైనా మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ నుంచి చైనా సరిహద్దు దళాలు 20కి.మీలు వెనక్కు వస్తాయి." అని చైనా ప్రకటించింది.
1962 యుద్ధంలో ఓడినప్పటికీ చైనా పేర్కొన్న ఎల్ఏసీని నెహ్రూ అంగీకరించలేదు. చైనా తాను చెబుతున్న ప్రదేశం నుంచి బలగాల ఉపసంహరణ చేయాలనే ప్రతిపాదన అర్థరహితమని నెహ్రూ అన్నారు.
తరువాత, 1988లో ప్రధాని రాజీవ్ గాంధీ బీజింగ్ పర్యటన తరువాత పలు సరిహద్దు ఒప్పందాలు జరిగాయి. దానికి ముందు ఎల్ఏసీ అమరికపై చర్చలు జరిగాయి.
పదేపదే అదే మాట..
1993 ఒప్పందానికి ముందు 1959 ఎల్ఏసీకే తాము అంగీకరిస్తామని చైనా నొక్కి చెప్పింది. అనంతరం జరిగిన చర్చల తర్వాత ఎల్ఏసీపై ఇరు దేశాల మధ్య విభేదాలు తొలగించడానికి ఓ నిపుణుల కమిటీ ఏర్పాటైంది.
1993లో భారత్, చైనా శాంతి స్థాపన ఒప్పందంలో ఎల్ఏసీ అనే పదాన్ని వాడారు. అయిదే అది 1959లో చైనా పేర్కొన్న రేఖ కాదని భారత్ స్పష్టంగా చెప్పింది.
అయితే చైనా సుముఖత చూపకపోవడం వల్ల 2003లో ఈ ప్రక్రియ అర్థాంతరంగా నిలిచిపోయింది.
![Ladakh disengagement and the Chinese 1959 claim line](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10634753_yvbvn.jpg)
2017లో పాంగాంగ్ సో సరస్సు వద్ద జరిగిన వివాదం సందర్భంగా 1959 ఎల్ఏసీ గురించి చైనా మరోసారి ప్రస్తావించింది. " శాంతి కోసం ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు, ఒడంబడికలకు భారత్ కట్టుబడి ఉండాలని కోరుతున్నాం. 1959 ఎల్ఏసీని చిత్తశుద్ధితో అనుసరించి సైనిక చర్యలను చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం." అని 2017 ఆగస్టు 21లో చైనా ప్రకటన విడుదల చేసింది.
2020లో లద్ధాఖ్ ప్రతిష్టంభన సమయంలోనూ చైనా విదేశాంగ మంత్రి అదే వక్కానించారు. భారత్ చైనా సరిహద్దు అంటే 1959 నవంబర్ 7నాటి ఎల్ఏసీనే అని చెప్పారు.
చైనా 1959 రేఖను భారత్ తిరస్కరించింది. నెహ్రూ కాలం నుంచి ఇప్పటి వరకు ఆ రేఖను భారత్ ఎప్పుడూ అంగీకరించలేదు.
చైనా చెప్పిన రేఖ వద్దే ఉపసంహరణ..
పాంగాంగ్ ఉత్తర ప్రాంతంలోని ఫింగర్ 8 వద్ద చైనా బలగాలు, ఫింగర్ 3 వద్ద భారత బలగాలు ఉంటాయని రాజ్‌నాథ్ చెప్పారు. ఫింగర్ 4 కూడా మన ప్రాంతమే అని, కానీ ఫింగర్ 3కి మారాలి వస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్‌కు చెందిన భూభాగంలోనే బఫర్ జోన్లు ఏర్పాటు చేయడం వల్ల చైనా ముందు భారత్ నిలువలేదని సందేశం ఇచ్చినట్లు అవుతందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదీ చూడండి: నేపాల్ చుట్టూ చైనా ఉచ్చు- వ్యూహాత్మకంగా భారత్!