India Canada Visa Update : రెండు నెలల విరామం తర్వాత కెనడా పౌరులకు వీసా సేవలను భారత్ పునరుద్ధరించింది. 'ఈ-వీసా' సేవలను తిరిగి ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత తలెత్తిన పరిణామాల నేపథ్యంలో.. కెనడా పౌరులకు వీసా సేవలను భారత్ నిలిపివేసింది. తదుపరి నోటీసులు జారీ అయ్యేంత వరకు సేవలు అందుబాటులో ఉండవని అప్పట్లో స్పష్టం చేసింది. తాజాగా, ఈ సేవలను ప్రారంభించినట్లు సంబంధిత వర్గాల సమాచారం.
కెనడాలోని భారత రాయబార కార్యాలయం సెప్టెంబర్‌లో అక్కడి పౌరులకు వీసా సేవలను నిలిపివేసింది. పలు కారణాల వల్ల సేవలను నిలిపివేస్తున్నట్లు బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. వివిధ దేశాల్లో వీసా సర్వీసుల విషయంలో భారత ప్రభుత్వానికి ఈ సంస్థ అవుట్సోర్సింగ్ సేవలు అందిస్తుంది. వీసా, పాస్‌పోర్ట్, కాన్సులర్, అటెస్టేషన్, పౌరులకు సంబంధించిన సేవల్లో ఇది భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. సెప్టెంబర్ 21 నుంచి కెనడా పౌరులకు వీసా సేవలను నిలిపివేస్తున్నామని.. అప్పట్లో బీఎల్ఎస్ సంస్థ తన వెబ్సైట్లో పేర్కొంది.
అనంతరం, అక్టోబర్‌లో కొన్ని సేవలను పునరుద్ధరించింది. నాలుగు కేటగిరీలకు చెందిన వీసా సేవలను తిరిగి ప్రారంభించింది. కెనడాలోని తమ దౌత్యవేత్తలకు భద్రత విషయంలో ట్రూడో సర్కారు తీసుకున్న చర్యలను దృష్టిలో పెట్టుకొని నాలుగు కేటగిరీల వీసా సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు భారత్ వివరించింది. ఈ మేరకు ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసాలను అక్టోబర్ 26న పునరుద్ధరించింది. ఈ నిర్ణయాన్ని కెనడా స్వాగతించింది. వీసాలు తిరిగి ప్రారంభం కావడం మంచి సంకేతమని పేర్కొంది.
దౌత్య వివాదానికి కారణమిదీ..
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యల తర్వాత భారత్, కెనడా మధ్య దౌత్య వివాదం తలెత్తింది. భారత్‌లో ఉగ్రవాదిగా గుర్తింపు ఉన్న హర్దీప్ సింగ్ నిజ్జర్ జూన్ 18న హత్యకు గురయ్యాడు. బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో ఓ గురుద్వారా ఎదుట ఈ ఘటన జరిగింది. కెనడా పార్లమెంట్లో మాట్లాడుతూ.. ఈ ఘటన వెనక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందని ట్రూడో వ్యాఖ్యానించారు. నిజ్జర్‌ను కెనడా పౌరుడిగా పేర్కొన్నారు. ఈ ఆరోపణలకు సంబంధించి తమ నిఘా వర్గాల వద్ద కచ్చితమైన సమాచారం ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన ఓ దౌత్యవేత్తను కెనడా.. తమ దేశం నుంచి పంపించేసింది.
కెనడాకు స్ట్రాంగ్ కౌంటర్
అయితే, ట్రూడో ఆరోపణలను భారత్ పూర్తిగా ఖండించింది. అవన్నీ అసంబద్ధ ఆరోపణలేనని కొట్టిపారేసింది. కెనడా చర్యలకు దీటుగా.. ఆ దేశానికి చెందిన దౌత్యవేత్తను భారత్ నుంచి బహిష్కరించింది. కెనడాలో జరిగిన హింసాత్మక ఘటనల్లో భారత్ ప్రమేయం ఉందని అనడం తగదని బదులిచ్చింది.
Canada India Relationship : భారత్-కెనడా విభేదాలకు కారణం ప్రధానే! రాజకీయ బలహీనత వల్లే ఇలా..
Justin Trudeaus Popularity : పడిపోయిన ట్రూడో పాపులారిటీ.. కెనడా నెక్స్ట్ ప్రధాని ఆయనే!