India Australia Virtual Summit: గత కొన్నేళ్లుగా భారత్- ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వ్యాపారం, పెట్టుబడులు, రక్షణవ్యవస్థ, విద్య, భద్రత, సాంకేతికత.. ఇలా అన్ని రంగాల్లోనూ ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌లు సోమవారం వర్చువల్‌గా సమావేశం అయ్యారు. వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య 15వేల కోట్ల విలువైన పెట్టుబడులను ప్రకటించారు.
"గత వర్చువల్ సమావేశంలో వ్యూహాత్మక సంబంధాలపై సమగ్రంగా చర్చించాం. ఇప్పుడు భారత్- ఆస్ట్రేలియా మధ్య వార్షిక సమావేశాలను మనం ప్రారంభించడంపై నాకు సంతోషంగా ఉంది. మన సంబంధాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఇది ఒక సమగ్ర వ్యవస్థగా ఏర్పడుతుంది. గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బలపడ్డాయి. వ్యాపారం, పెట్టుబడులు, రక్షణవ్యవస్థ, విద్య, భద్రత, సాంకేతికత.. ఇలా అన్ని రంగాల్లోనూ ఉమ్మడిగా ముందుకు సాగాం."
-- ప్రధాని నరేంద్ర మోదీ
అన్ని రంగాల్లో పరస్పర సహకారం..
ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో పలు కీలక అంశాలపై చర్చించారు మోదీ, స్కాట్. వ్యాపారం, ఖనిజ సంపద, విద్య, వలస తదితర అంశాల్లో ఒకరికొకరు క్షేత్రస్థాయిలో సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. వ్యాపారపరంగా ఇరుదేశాల మధ్య కొన్ని సరకుల రవాణాపై పన్ను సడలింపులు, వ్యాపారం సజావుగా సాగే విధంగా మార్పులకు సంబంధించిన నిర్ణయాలపై ఈ నెల చివరి వరకు ఇరు దేశాలు ఓ అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్లో ప్రాణనష్టానికి రష్యాను జవాబుదారీ చేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఐరోపా దేశాల్లో జరుగుతున్న పరిణామాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో జరగకుండా దృష్టిసారించాలన్నారు.
"ఉక్రెయిన్- రష్యా యుద్ధ నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. అలాంటి సంఘటనలు ఇండో- పసిఫిక్ ప్రాంతంలో ఎప్పటికీ జరగకూడదు. ఐరోపాలోని ప్రస్తుత పరిస్థితుల మధ్య మన దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నందుకు కృతజ్ఞతలు. ఉక్రెయిన్పై రష్యా చట్టవ్యతిరేక దాడిపై మన క్వాడ్ దేశాలు ఇప్పటికే టెలిఫోన్లో చర్చించాయి."
-- స్కాట్ మోరిసన్, ఆస్ట్రేలియా ప్రధాని
అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయంపై స్కాట్ మోరిసన్.. ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. 2020లో ఇరుదేశాల మధ్య తొలిసారిగా వర్చువల్ సమావేశం జరిగింది. సమగ్ర వ్యూహాత్మక సంబధాలపై గతంలో ఇరుదేశాలు దృష్టిసారించాయి.
ఆయన అర్థం చేసుకున్నారు..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ వైఖరిని స్కాట్ అర్థం చేసుకున్నారని ఇరు దేశాధినేతల భేటీ అనంతరం తెలిపారు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా. ఇండో-పసిఫిక్ నుంచి దృష్టి మరల్చేందుకు ఉక్రెయిన్ వ్యవహారం కారణం కాకూడదని మోదీ, స్కాట్ ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు వివరించారు.
ఇదీ చూడండి: దిల్లీ నుంచి వెళ్లే ఫ్లైట్లో పొగలు.. పాక్లో అత్యవసర ల్యాండింగ్