ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నవారిలో 10 శాతం మంది భారతీయులే అని రోడ్ సేఫ్టీపై అధ్యయనం చేసిన ప్రపంచ బ్యాంక్ నివేదించింది. మొత్తం దేశాలతో పోల్చితే భారత్లో 1 శాతం మాత్రమే వాహనాలు ఉన్నా.. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడం గమనార్హం.
దీనిపై స్పందించిన ప్రపంచ బ్యాంక్ దక్షిణాసియా విభాగం ఉపాధ్యక్షుడు హార్ట్విగ్ స్కాఫర్.. గత కొన్నేళ్లుగా రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు భారత ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుందని తెలిపారు. కానీ, దీనిపై మరింత శ్రద్ధ వహించాల్సి ఉందని పేర్కొన్నారు. రహదారుల రక్షణపై వరల్డ్ బ్యాంకు తయారు చేసిన నివేదికను దిల్లీలో విడుదల చేసిన నేపథ్యంలో స్కాఫర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదాల వల్ల పేదలకు మరిన్ని ఇబ్బందులు పెరుగుతున్నాయని అన్నారు.
2019లో రోడ్డు ప్రమాదాల వివరాలు...
2019 రోడ్డు ప్రమాదాల జాబితా ప్రకారం భారత్లో 4,49,002 యాక్సిండెంట్లు అయ్యాయి. ఇందులో 1,51,113లో మృతిచెందడం గమనార్హం.
కొవిడ్ కన్నా ప్రమాదకారి....
దేశంలో రోజుకు 415 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఇటీవలే జాతీయ రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. భారతదేశంలో కొవిడ్ కన్నా రోడ్డు ప్రమాదాలే మరింత ప్రమాదకరంగా మారాయని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రిస్తే ఒక వ్యక్తిపై దాదాపు రూ. 90 లక్షల వరకూ ఆదా చేయొచ్చని వెల్లడించారు.
పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితం విలువైనదే అని గడ్కరీ అన్నారు. వరల్డ్ బ్యాంక్ నివేదిక మేలుకొలుపులాంటిదని వ్యాఖ్యానించారు. రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలైతే రూ. 3.64 లక్షలు, స్వల్ప గాయాలైతే రూ. 77,938, మరణిస్తే రూ. 91.16 లక్షలు వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. 70 శాతం మంది మృతులు 18 నుంచి 45 మధ్య వయస్కులే అని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు ప్రభుత్వం పలు చర్యులు తీసుకుంటుందని తెలిపారు.
ఇదీ చదవండి:పులి దాడిలో భార్యాభర్తలు మృతి