High Temperature in Telangana : రాష్ట్రంలో రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాలలో.. అలాగే రేపు ఈ జిల్లాలతో పాటు ఈశాన్య జిల్లాలలో 43 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ చుట్టూ పక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఈరోజు దిగువ స్థాయిలోని గాలులు వాయువ్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నాయని తెలిపింది.
Heat Wave in Telangana : మరోవైపు ఎండల ధాటికి అనేకమంది వడదెబ్బ బారినపడి అస్వస్థతకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భానుడి సెగలకు మొత్తం ఏడుగురు మృత్యువాత పడ్డారు. నల్గొండ సమీపంలోని చర్లపల్లి ప్రాంతానికి చెందిన మారోజు రాములు (74) సోమవారం రాత్రి వడదెబ్బతో చనిపోయినట్లు నల్గొండ జనరల్ ఆసుపత్రిలోని వైద్యులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చింతోనిగుంపు గ్రామానికి చెందిన మహిళ జోగ ఉపేంద్ర (38) సోమవారం తునికా సేకరణకు వెళ్లి వడదెబ్బతో మంగళవారం ఆసుపత్రిలో కన్నుమూశారు.
Telangana Sun Stroke Cases : మంచిర్యాలలోని జాఫర్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ మొహమ్మద్ సలీం (32) మంగళవారం బయటకు వెళ్లి వచ్చి నీరసంతో కుప్పకూలిపోయి మృత్యువాత గురయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం బొప్పపూర్‌కు చెందిన యువ రైతు ఏర్మా హనుమంతురావు (29) పొలం వెళ్లొచ్చి వాంతులు చేసుకుని చనిపోయారు. కాగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వడదెబ్బకు గురై ముగ్గురు చనిపోయారు.
జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిన నేపథ్యంలో వడదెబ్బ ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ (డీహెచ్) జి.శ్రీనివాసరావు అన్నారు. అనారోగ్యం బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక పడకలు, ఐవీ ఫ్లూయిడ్స్ సహా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తల వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచామని తెలిపారు.
దప్పికతో సంబంధం లేకుండా అవసరమైన నీటిని తాగాలని, నిమ్మరసం, మజ్జిగ, ఓఆర్ఎస్, లస్సీ, పళ్లరసాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ప్రయాణ సమయంలో తాగునీటి బాటిళ్లను వెంట ఉంచుకోవాలన్నారు. సీజనల్ పండ్లను తినాలన్నారు. సాధ్యమైనంత వరకు ఎండకు దూరంగా ఉండాలని తెలిపారు. మిట్ట మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఎండలు అధికంగా ఉన్న సమయంలో శారీరక శ్రమతో కూడిన పనులకు దూరంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్ సూచించారు.
ఇవీ చదవండి: