Income Tax Raid Jaipur: రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన ఓ జ్యువెలరీ సంస్థ కార్యాలయాలపై చేపట్టిన దాడుల్లో ఆదాయపు పన్ను శాఖ రూ.500 కోట్ల నల్లధనాన్ని గుర్తించినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. జైపుర్‌లో సంబంధిత సంస్థకు చెందిన దాదాపు 50 కేంద్రాల్లో నవంబరు 23న సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 4 కోట్ల నగదు, రూ. 9 కోట్లు విలువ చేసే ఆభరణాలను అధికారులు జప్తు చేశారు.
ఇప్పటివరకు సంస్థ నుంచి రూ. 500 కోట్ల లెక్క చూపని ఆదాయాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో రూ. 72 కోట్లు నల్లధనమని సంస్థ అంగీకరించినట్లు పేర్కొన్నారు. క్యాష్ లోన్స్ సహా పలు క్రయవిక్రయాలకు సంబంధించి సంస్థ అవకతవకలకు పాల్పడిందని.. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించినట్లు తెలిపారు.
ఆభరణాలు, వజ్రాల తయారీ- ఎగుమతులే లక్ష్యంగా ఈ సంస్థ వ్యాపారం సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆఫ్రికా దేశాల నుంచి ముడి సరకును దిగుమతి చేసుకుని జైపుర్‌లో తయారు చేస్తున్నారని తెలిపారు. లెక్క చూపని ఆదాయంలో కొంత భాగం వజ్రాల తయారీలో మిగిలిన పదార్థాల విక్రయం ద్వారా వచ్చినదని అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి : ఈ చిన్నారి జ్ఞాపక శక్తి చూస్తే 'వావ్' అనాల్సిందే!