దేశంలో కరోనా సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఎంతోమందిని పొట్టన పెట్టుకొన్న ఈ రక్కసి.. ఎన్నో కుటుంబాల్లో అంతులేని శోకం మిగుల్చుతోంది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే అస్త్రం కావడంతో ఉత్తర్‌ప్రదేశ్ ఇటావా జిల్లా యంత్రాంగం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను(Vaccination Drive) ప్రోత్సహించడమే లక్ష్యంగా సైఫాయి పట్టణంలోని మద్యం దుకాణాల వద్ద ప్రత్యేక నోటీసు బోర్డులు అంటించేలా చర్యలు చేపట్టింది. వ్యాక్సిన్ వేయించుకున్నట్టు సర్టిఫికెట్ చూపించిన వాళ్లకే మద్యం(liquor) విక్రయించేలా ఆదేశాలు జారీచేసింది.
టీకా వేయించుకోని వాళ్లకు మద్యం విక్రయించొద్దంటూ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ తమకు ఆదేశాలు జారీచేసినట్టు మద్యం దుకాణదారుడు ఒకరు తెలిపారు. కరోనా టీకా(Vaccination Drive) వేయించుకున్నట్టుగా ధ్రువీకరణ పత్రాన్ని చూపించిన తర్వాతే అమ్ముతున్నామన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నవాళ్లకు మాత్రమే మద్యం అందుబాటులో ఉంటుందని పేర్కొంటూ దుకాణాల బయట బోర్డులు ఏర్పాటు చేయడం గమనార్హం. ఇటావా జిల్లాలో ఇప్పటివరకు 13,777 కేసులు నమోదు కాగా.. 279 మంది మరణించారు. వీరిలో 13,200మంది కోలుకోగా.. ప్రస్తుతం అక్కడ 298 క్రియాశీల కేసులు ఉన్నాయి.
ఇదీ చూడండి: Vaccine: 'టీకాల విధానంలో ఇన్ని లోపాలా?'