evm machine use: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల) విశ్వసనీయతపై పలు అనుమానాలు ఉన్నందున దేశంలో జరిగే ఎన్నికల్లో ఆ యంత్రాలకు బదులు మళ్లీ బ్యాలెట్ పత్రాలను వాడాలని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తండ్రి నందకుమార్ బఘేల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఆయన లేఖ రాస్తూ.. ఈ డిమాండును ఆమోదించకపోతే తన అనాయాస మరణానికి అనుమతి ఇవ్వాలని కోరారు.
ఓటర్లను జాగృతం చేసే 'రాష్ట్రీయ మత్‌దాతా జాగృతి మంచ్' అధ్యక్షుడిగా ఉంటున్న నందకుమార్ 'పౌరుల రాజ్యాంగ హక్కులను హరిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన వ్యవస్థలన్నీ నాశనం అవుతున్నాయి. ఈ దేశ పౌరుల్లో భయం పెరుగుతోంది' అని తన లేఖలో వివరించారు.
'ఈ వ్యవస్థలో నాకు బతకాలని లేదు. రాష్ట్రపతీజీ! మీరు రాజ్యాంగాన్ని రక్షిస్తానని ప్రమాణం చేశారు. నా రాజ్యాంగ హక్కులకు రక్షణ లేదు. కాబట్టి, నాకు మరణం తప్ప మరో మార్గం లేదు. జాతీయ ఓటరు దినోత్సవం అయిన జనవరి 25న నా అనాయాస మరణానికి అనుమతైనా ఇవ్వండి' అని కోరారు. ఒక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడారన్న అభియాగంపై గత సెప్టెంబరులో నందకుమార్ బఘేల్ అరెస్టయిన విషయం తెలిసిందే.
ఇదీ చూడండి: 'ఇల్లు కట్టుకోవడానికి డబ్బులడిగినా వరకట్నం డిమాండ్ చేయడమే'