నైరుతి రుతుపవనాలు ఐదు రోజుల ఆలస్యంగా దేశవ్యాప్తంగా విస్తరించాయి. దిల్లీ, రాజధాని ప్రాంతంలోకి రుతుపవనాలు మంగళవారం ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.
రాజస్థాన్లోని జైసల్మేర్, గంగానగర్లను రుతుపవనాలు సోమవారమే చుట్టేసినా... దిల్లీకి మాత్రం విస్తరించలేదు. మంగళవారం దిల్లీ సహా రాజధాని ప్రాంతంలో విస్తారమైన వర్షాలు కురిశాయి. దీంతో దిల్లీకి నైరుతి రుతుపవనాలు వచ్చినట్లు ఐఎండీ ప్రకటన జారీ చేసింది.
"గత నాలుగు రోజులుగా బంగాళాఖాతం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో చెల్లాచెదురుగా ఉన్న రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. దిల్లీ సహా ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్లోని మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాలు వ్యాపించాయి."
-ఐఎండీ
సాధారణంగా జూన్ 1న రావాల్సి ఉన్న నైరుతి రుతుపవనాలు జూన్ 3న కేరళ తీరాన్ని తాకాయి. అయితే వేగంగానే దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. జూన్ 15 నాటికి ఉత్తరభారతదేశంలోని అనేక ప్రాంతాలను చుట్టేశాయి. కానీ.. పశ్చిమ గాలులు, ఇతర ప్రతికూల పరిస్థితుల కారణంగా దిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ఇవి వ్యాపించలేదు.
మరోవైపు, నైరుతి రుతుపవనాల ఆగమనంపై ఐఎండీ అంచనాలు ఈ సారి తప్పాయి. దిల్లీ సహా పరిసర ప్రాంతాలకు రుతుపవనాలు జూన్ 15నాటికి చేరుకుంటాయని జూన్ 13న అంచనా వేసింది. వీటిని మళ్లీ సవరించింది. జులై 10 నాటికి ఇవి దిల్లీకి వ్యాపిస్తాయని జులై 5న ప్రకటించింది. చివరకు జులై 13న రుతుపవనాలు దిల్లీని తాకాయి. సాధారణంగా జులై 8నాటికి నైరుతి రుతుపవనాలు దేశమంతటా వ్యాపిస్తాయి.
ఇదీ చదవండి: Heavy rains: విరిగిపడిన కొండచరియలు- ఇద్దరు మృతి