ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అల్లోపతి వైద్య శాస్త్రం, వైద్యులను అవమానించేలా మాట్లాడారని భారత వైద్య సంఘం (ఐఎంఏ) ఆరోపించింది. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ తక్షణం స్పందించి ఆయనపై కేసు నమోదు చేయాలని ఐఎంఏ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఐఎంఏ సామాజిక మాధ్యమాల్లో ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. కరోనా కాలంలో ఎన్నో ఒడుదొడుకులకు గురవుతూ, వైద్యులు శ్రమిస్తుంటే ఈ విధమైన నిందలు తగవని ఆ ప్రకటనలో పేర్కొంది.
బాబా రాందేవ్‌పై అంటువ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేయాలని, లేదంటే ఆధునిక వైద్య శాస్త్రాన్ని రద్దు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని ఐఎంఏ నాయకులు కోరారు. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయడం ద్వారా ఆరోగ్య కార్యకర్తలు, రోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీంటుందని అన్నారు.
తాజాగా బాబా రాందేవ్ ఆధునిక వైద్యశాస్త్రాన్ని, వైద్య విధానాలను అవమానించే విధంగా మాట్లాడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గతంలో కూడా బాబా రాందేవ్ ఆధునిక వైద్యులను హంతకులుగా అభివర్ణించి విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ప్రజలు ఆక్సిజన్ కొరతతో అల్లాడుతుంటే 'వారికి సరిగా శ్వాస తీసుకోవడం కూడా రావట్లేదు' అంటూ ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి: పతంజలి రామ్‌దేవ్ బాబాపై ఎఫ్ఐఆర్ నమోదు