కర్ణాటకలో సివిల్ సర్వీసు ఉద్యోగులైన భార్యభర్తల మధ్య వివాదం(IFS officer husband and IPS officer wife) తారస్థాయికి చేరింది. ఐఎఎఫ్ఎస్ అధికారి నితిన్ సుభాష్ లోలా తన భార్య, ఐపీఎస్ అధికారి వర్తికా కటియార్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రవికుమార్‌కు లేఖ రాశారు. ఐఏఎస్ అధికారి అనురాగ్ తివారీ మృతి వెనుక తన భార్య హస్తం ఉందని ఆరోపించారు.
"2017లో లఖ్‌నవూలోని ప్రభుత్వ అతిథి గృహం బయట అనుమానాస్పదంగా మరణించిన కర్ణాటక ఐఏఎస్ అధికారి అనురాగ్ తివారీ మృతి వెనుక నా భార్య కటియార్ హస్తం ఉంది. అయాజ్ ఖాన్ అనే వ్యక్తితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా... శ్రీలంక, అఫ్గానిస్థాన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఇటలీ దేశాల్లో కటియార్ పర్యటించారు. ఆమె సివిల్ సర్వీసు నియమాలను ఉల్లంఘించారు. అయాజ్ ఖాన్‌తో కలిసి క్యాసినోకు కూడా వెళ్లారు."
-నితిన్ సుభాష్ లోలా, ఐఎఫ్ఎస్ అధికారి.
"కటియార్ ప్రవర్తన సరిగా లేదు. ఆమె షిజోఫ్రెనియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. తన కోపాన్ని నియంత్రించడానికి ఆమెను ఎన్ఐఎమ్హెచ్ఏఎన్ఎస్లో 2017లో చేర్పించాం. ఆమెకు ప్రధాన బాధ్యతలు అప్పగించే ముందు ఈ విషయాన్ని ప్రభుత్వం ఓసారి సమీక్షించాలి." అని లేఖలో లోలా పేర్కొన్నారు.
అయితే.. అంతకుముందు, వర్తికా కటియార్ తన భర్త తనను కట్నం కోసం వేధిస్తున్నారని, యాసిడ్ దాడికి యత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బెంగళూరు న్యాయస్థానం ఆదేశాలతో యాసిడ్ దాడి అభియోగాల కింద బెంగళూరు విధాన సౌధ పోలీసులు.. లోలాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మిగతా అభియోగాలపై దిల్లీ పోలీస్ స్టేషన్లో లోలాపై కేసులు నమోదయ్యాయి. వీటిపై దిల్లీ హైకోర్టు విచారణ జరుపుతోంది.
'నేను భయపడను'
తన భర్త చేసిన ఆరోపణలను వర్తికా కటియార్ ఖండించారు. తనపై ప్రతీకారం తీర్చుకోవాలనే లోలా ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. మే-జూన్ మధ్యలో బెంగళూరుకు వచ్చి తనపై యాసిడ్ దాడికి యత్నించారని చెప్పారు. లోలాపై నమోదైన ఐదు కేసులను దిల్లీ హైకోర్టు విచారణ జరుపుతోందని తెలిపారు. "11 ఏళ్ల క్రితం.. నేను పోలీసు శాఖలో చేరాను. దర్యాప్తులకు నేను భయపడను" అని ఆమె చెప్పారు.
ఇదీ చూడండి: అండర్‌వేర్‌తోనే ఎమ్మెల్యే ట్రైన్ జర్నీ- అదే కారణమట!
ఇదీ చూడండి: ఫోన్లో గేమ్ ఆడొద్దన్న తండ్రిని గొంతుకోసి చంపిన మైనర్