దేశంలో ప్రస్తుతం ఉన్న రోజువారీ పరీక్షల సామర్థ్యాన్ని 25 లక్షల (13 లక్షల ఆర్టీపీసీఆర్, 12 లక్షల ర్యాపిడ్ యాంటీజెన్) నుంచి 45 లక్షలకు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఐసీఎంఆర్ డైరక్టర్ బలరాం భార్గవ తెలిపారు. సోమవారం కేంద్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం పరీక్షల విధానంలో మార్పులు చేయడం వల్ల ఎక్కువమందిని ఒకేసారి స్క్రీనింగ్ చేయడానికి వీలవుతుందని పేర్కొన్నారు. వైద్యసౌకర్యాలు తక్కువగా ఉన్న పట్టణ శివారు ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇది బాగా పనిచేస్తోందన్నారు. ఆర్టీపీసీఆర్ మొబైల్ టెస్టింగ్ వ్యాన్లను మోహరించడం సహా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులను వేగవంతం చేయడమే ఇప్పుడున్న తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా నమోదవుతున్న వివిధ వైరస్ రకాల గురించి జాతీయ అంటువ్యాధుల నియంత్రణ సంస్థ డైరెక్టర్ సుజీత్‌కుమార్ వివరించారు. ప్రస్తుతం దేశంలో బి.1.1.7, బి1.617 రకాలు (వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్) ఉన్నాయని చెప్పారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పంజాబ్, చండీగఢ్‌లలో బి.1.1.7 (యూకే రకం) ఎక్కువ కనిపించినట్లు తెలిపారు. ఇన్సాకాగ్ (ఇండియన్స్ సార్స్-కొవి-2 జీనోమిక్స్ కన్సార్షియం)లో ఇప్పుడున్న పదింటికి తోడు మరో 17 ప్రయోగశాలలను చేరుస్తున్నట్లు కేంద్రమంత్రి హర్షవర్ధన్ చెప్పారు.
ఇదీ చదవండి : నారదా కుంభకోణం: మంత్రుల బెయిల్‌పై స్టే-జైలుకు తరలింపు