భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) మూడో సారి నిర్వహించిన సెరోసర్వేలో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. దేశ జనాభాలో 24.1 శాతం మంది ఇప్పటికే కరోనా బారినపడినట్లు ఈ సర్వే తేల్చింది. అయితే కేంద్రం ప్రకటించిన గణాంకాలకు, ఐసీఎంఆర్ లెక్కలకు అసలు పొంతన లేదు. దేశంలో 2 శాతం మందికే కరోనా సోకిందని కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవలే వెల్లడించింది.
2020 డిసెంబర్- 2021 జనవరి మధ్య ఐసీఎంఆర్ ఈ సెరోసర్వే నిర్వహించింది. దీని ప్రకారం ఒక్క కరోనా కేసును గుర్తిస్తే 27 మందికి వైరస్ సోకినట్లే అని తెలుస్తోంది. ఆరోగ్య కార్యకర్తలు సహా దేశంలో పదేళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు వైరస్ కారణంగా ప్రభావితం అయినట్లేనని సర్వే స్పష్టం చేసింది. ఆరోగ్య సిబ్బందిలో 25.6 శాతం మంది కరోనా బారినపడినట్లు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాల్లోనే ఎక్కువ మంది బాధితులున్నట్లు స్పష్టం చేసింది.
యాంటీబాడీలతో..
సెరోసర్వేలో సాధారణ పౌరుల రక్త నమూనాలు సేకరించి IgG యాంటీ బాడీలు ఉన్నాయో లేదో పరీక్షిస్తారు. ఫలితం పాజిటివ్ వస్తే.. ఆ వ్యక్తి అప్పటికే వైరస్ బారినపడినట్లు లెక్క. వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత తొలిసారి 2020 మే-జూన్లో ఐసీఎంర్ సెరోసర్వే చేపట్టింది. అప్పుడు దేశ జనాభాలో 0.73శాతం మందిలోనే యాంటీబాడీలున్నాయి. 2020 ఆగస్టు- సెప్టెంబరులో రెండోసారి సేరోసర్వే నిర్వహించినప్పుడు ఆ శాతం 7.1కి పెరిగింది. తాజాగా 24.1శాతానికి చేరింది.
ఎంపిక చేసిన జిల్లాల్లో..
దేశంలోని 21 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 70 జిల్లాల్లోనే ఈ సర్వేలు నిర్వహించారు. పదేళ్లు పైడిన వారిలో కనీసం 400 మంది నమూనాలను పరీక్షించారు. ఆరోగ్య సిబ్బందిలో 100 మంది శాంపిళ్లను సేకరించారు. ఎంతమంది వైరస్ బారిన పడ్డారనే విషయాన్ని నిర్ధరించుకోవడానికే ఈ సెరోసర్వేలు చేపడతారు.
ఈ సర్వేపై ప్రముఖ వైద్యులు, ఆరోగ్య నిపుణులు డా.సునీల గార్గ్ స్పందించారు. 24.1 మంది కాకుండా మిగతా వారికి వైరస్ సోకే ముప్పు ఉందని హెచ్చరించారు. వైరస్ ఉద్ధృతికి గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది బాధితులుగా మారారని, కొందరిలో యాంటీబాడీలు కూడా ఉత్పత్తి అయ్యాయని వివరించారు. మరో సెరోసర్వే నిర్వహిస్తే ఇంకా ఎంతమందికి వైరస్ సోకిందో తెలుస్తుందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయలు సరిగ్గా ఉండవు కాబట్టి.. టీకా పంపిణీలో వారికే ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: లాక్డౌన్ వేళ బయటకు వస్తే కరోనా టెస్టే!