చెన్నైలో ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడుల్లో.. ఓ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్‌లో వెయ్యి కోట్ల రూపాయల నల్లధనం బయటపడింది. నవంబర్ 4న.. చెన్నై, మధురై సహా తమిళనాడులోని ఐదు ప్రాంతాల్లో చేసిన దాడుల్లో ఈ మొత్తాన్ని గుర్తించామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఓ ప్రకటనలో వెల్లడించింది. నల్లధనం నుంచి అదనపు ఆదాయం కింద చూపిన 337 కోట్ల రూపాయలపై.. బినామీ, నల్లధనం చట్టాల కింద చర్యలు చేపట్టామని తెలిపింది.
అసలు కంపెనీకి తక్కువ వాటా..
ఐదు షెల్ కంపెనీలను స్థాపించి, ప్రధాన సంస్థ నుంచి 337 కోట్ల నిధులను బోగస్ బిల్లుల ద్వారా వాటిల్లోకి మళ్లించినట్లు వివరించింది సీబీడీటీ. ఈ కంపెనీకి సింగపూర్ రిజిస్టర్ కంపెనీలో పెట్టుబడులతో సంబంధం ఉందన్న సమాచారంతో దాడులు చేసినట్లు పేర్కొంది.
ఐటీ ఇన్‌ఫ్రా గ్రూప్‌నకు సంబంధించిన కంపెనీ వాస్తవానికి చాలా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టినా..72 శాతం వాటా కలిగి ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. మొత్తం పెట్టుబడులు పెట్టిన మరో కంపెనీకి మాత్రం.. 28 శాతం వాటాలే ఉన్నట్లు పేర్కొన్నారు. 2015 నల్లధనం చట్టం ప్రకారం.. సంస్థపై చర్యలు తీసుకుంటామని సీబీడీటీ అధికారులు స్పష్టం చేశారు.