తృణమూల్ కాంగ్రెస్ అసంతృప్త నేత సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బంగాల్ బిడ్డనని.. ప్రజల కోసం సేవ కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
''ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం. భారత రాజ్యాంగం ఇదే చెబుతోంది. నేను బంగాల్ బిడ్డను. భరతమాత తనయుడిని. నా సామర్థ్యం మేరకు.. నా రాష్ట్ర ప్రజలకు నేను సేవ కొనసాగిస్తా.''
- సువేందు అధికారి
వారం రోజుల క్రితం.. మమత కేబినెట్ నుంచి వైదొలిగిన ఆయన.. గురువారం పార్టీ జెండాలు, ప్లకార్డులు లేకుండానే ర్యాలీ నిర్వహించారు. ఆయన అనుచరులు కూడా జాతీయ జెండాలు పట్టుకొనే కనిపించారు. ఇది రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల నడుమ.. సువేందు పార్టీ వీడనున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. భాజపాలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఆయనను వెనక్కి రప్పించేందుకు పార్టీ అధిష్ఠానం ప్రయత్నిస్తున్నప్పటికీ అవి ఫలించేలా కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలోనే.. సువేందు పైవ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 6న ఆయన తూర్పు మిడ్నాపూర్‌లోని తన సొంతఊరు కాంథీలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుతం దీనిపైనే అందరి దృష్టీ నెలకొంది. ఆయన పార్టీ మారతారా? మారితే తదుపరి వ్యూహాలేంటి? అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇదీ చూడండి: దీదీకి షాక్- మంత్రి పదవికి సువేందు రాజీనామా
ఆయన నిర్ణయమేంటో..?
సువేందును బుజ్జగించేందుకు తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. గత మంగళవారం.. ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించామని, సమస్య పరిష్కారమైందని పార్టీ ఎంపీ సౌగతా రాయ్ తెలిపారు. ఇప్పుడు మళ్లీ ఆయనను సంప్రదించాలని చూసినా స్పందించడం లేదని, ఇక ఆయనతో చర్చలు జరగవని తేల్చిచెప్పారు. ఇక ఆయన ఏం మాట్లాడతారో చూడాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'సువేందు.. తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చు'
అభిషేక్, కిశోర్‌పైనే..
సువేందు అధికారి కొంతకాలంగా పార్టీ అధినాయకత్వంపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన కీలక విషయాల్లో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సహా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై సువేందు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
సువేందు వెళితే అంతే..
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సువేందు పార్టీని వీడితే అది తృణమూల్‌కు పెద్ద నష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక, సొంతనియోజకవర్గంతో పాటు పశ్చిమ మిడ్నాపూర్, బంకురా, పురూలియా, ఝాగ్రమ్, బీర్భుమ్, గిరిజనులు అధికంగా ఉండే జంగిల్‌మహల్ ప్రాంతంలో సువేందు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఇదీ చూడండి: బంగాల్ దంగల్: దీదీ సేనలో అసమ్మతి జ్వాల!
సువేందు పార్టీని వీడితే ఈ ప్రాంతాల్లోని దాదాపు 35-40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ ప్రభావం ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 294 అసెంబ్లీ స్థానాలున్న బంగాల్‌కు వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల మధ్య ఎన్నికలు జరగనున్నాయి.