"నా భార్య చాలా చురుకైంది. చదువులో ఎలాంటి సమస్యా రానీయకూడదని నిశ్చయించుకున్నా. నేను పెద్దగా చదువుకోలేదు. పదోతరగతి కూడా పూర్తిచేయలేదు. ఆమెను ఉన్నత చదువులు చదివిస్తే, నా భర్త ప్రోత్సహించాడని జీవితాంతం చెప్పుకుంటుంది." - ధనంజయ్ మాజీ
సంకల్పం ముందు సమస్యలన్నీ చిన్నబోతాయంటారు. ఝార్ఖండ్‌కు చెందిన ధనంజయ్ మాజీ విషయంలో ఇదే జరిగింది. గర్భిణీ అయిన భార్యతో పరీక్ష రాయించేందుకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు 1200 కిలోమీటర్ల దూరం స్కూటీపై ప్రయాణం చేశాడాయన. టోలా గ్రామానికి చెందిన అనిత.. డీఎడ్ రెండో ఏడాది చదువుతోంది. ధనంజయ్ గుజరాత్‌లో పనిచేసేవాడు. లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగం కోల్పోయి, ఇంటివద్దనే ఉంటున్నాడు.
పరీక్ష రాసేందుకు గ్వాలియర్‌కు బస్సులో వెళ్లాలని ముందుగా అనుకున్నాడు ధనంజయ్. ప్రైవేటు బస్సు కోసం సంప్రదిస్తే ఒక్కో టికెట్టు ధర 15 వేల రూపాయలకు పైగానే ఉందని తెలిసింది. అంత డబ్బు లేక, రైలు టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ చివరి నిమిషంలో రైలు కూడా రద్దయింది. ఏంచేయాలో అర్థంకాక, చివరకు 6 నెలల గర్భిణీ అయిన భార్యను స్కూటీపైనే గ్వాలియర్‌కు తీసుకెళ్లి పరీక్ష రాయించాలని నిర్ణయించుకున్నాడు. ఖర్చుల కోసం అనిత తన నగలు తాకట్టు పెట్టింది.
గ్వాలియర్‌కు చేరుకున్నాక, ఎక్కడ బసచేయాలి, తిరిగి ఝార్ఖండ్‌కు ఎలా చేరుకోవాలన్న ప్రశ్నలతో సతమతమయ్యారు దంపతులు. వీరి సమస్య ఈటీవీ భారత్‌లో ప్రచురితమైన తర్వాత స్థానిక యంత్రాంగం, కొందరు స్వచ్ఛంద సేవకులు వారికి సహకారమందించారు. అధికారులు 5 వేల రూపాయల ఆర్థిక సాయం చేయగా.. భోజనం, వసతి స్థానికులు కల్పించారు.
"నా భర్త ఇంతలా ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గర్భిణీని అయినందున పరీక్షకు వెళ్లేందుకు నా కుటుంబసభ్యులు, బంధువులు అంతా అడ్డుతగిలారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాతో పరీక్ష రాయిస్తానని నా భర్త చెప్పాడు. చాలా సంతోషించా. చాలా కష్టాలు పడ్డాం. వరదల వల్ల రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. నీళ్లలో నాని, నా పాదాల్లో విపరీతమైన వాపు వచ్చింది. గ్వాలియర్‌కు వెళ్లేసరికే బలహీనంగా తయారయాం. ఇప్పుడంతా బాగానే ఉంది."
- అనితా మాజీ
పరీక్ష రాసి, ఇంటికి తిరిగొచ్చిన తర్వాత బాబుకు జన్మనిచ్చింది అనిత. తల్లీబిడ్డా ప్రస్తుతం ఆరోగ్యకరంగానే ఉన్నారు.
"అదొక మంచి జ్ఞాపకం. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ గ్వాలియర్‌కు వెళ్లాం. అక్కడికి వెళ్లాక బాగానే ఉంది. తిరిగి విమానంలో ఇంటికొచ్చాం. గర్భిణీగా స్కూటీపై అన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడం మంచిది కాదని, వాళ్లే విమానంలో పంపించారు. ఇంటికొచ్చిన నెలన్నర తర్వాత బాబు పుట్టాడు. చాలా సంతోషంగా ఉంది."
- ధనంజయ్ మాజీ
"పరీక్ష రాయడానికి చాలా ఇబ్బందులు పడ్డాం. సరైన రవాణా సదుపాయాలు లేక, స్కూటీపైనే వెళ్లాల్సొచ్చింది. అక్కడికెళ్లాక మీడియా, అధికారులు చొరవ తీసుకోవడం వల్ల ఇంటికి సురక్షితంగా చేరుకోగలిగాం. టీచర్ కావాలన్నది నా కల. దానికోసమే కష్టపడుతున్నా. నా బిడ్డకూ అన్ని సౌకర్యాలూ కల్పించి, ఉన్నత చదువులు చదివించాలని అనుకుంటున్నా."
- అనితా మాజీ
ఇలాంటి పరిస్థితుల్లో అసలు పరీక్ష రాస్తాననే ఊహించలేదని చెప్తోంది అనిత. భర్త సహకారంతో కష్టపడి చదువుకుని, టీచరు అవుతానన్న ధీమాతో ఉంది.
ఇదీ చూడండి: ఆ అనుభూతిని పంచే 'గడపగడపకూ హరిద్వార్'