కర్ణాటకలోని బెంగళూరు జిల్లాలో హృదయ విదారక ఘటన జరిగింది. ఓ కుటుంబాన్ని కరోనా వైరస్ పొట్టన పెట్టుకుంది. కుటుంబంలో ఓ వ్యక్తి, ఆయన తల్లి కరోనా కారణంగా మరణించారు. తన భర్త, అత్త మరణాన్ని తట్టుకోలేక ఆ మహిళ.. కుమారుడితో కలిసి రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకుంది.
జిల్లాలోని బెంగళూరు ఉత్తర తాలూక, సోమశెట్టిహళ్లి ప్రాంతంలో రేఖ.. తన కుటుంబంతో ఉండేది. గత ఏడాది అక్టోబర్ 20న ఆమె భర్త శివరాజ్ కరోనాతో మరణించారు. శివరాజ్ చనిపోయిన వారం రోజులకు ఆయన తల్లి శివాంభిక కూడా కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. వారి మరణంతో రేఖ.. ఆమె కుమారుడు మనోజ్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలోనే రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు.
శివకుమార్.. కాంట్రాక్టర్ వృత్తి చేసేవారు. వారి కుటుంబం ఆర్థికంగా స్థిరపడింది.
కొవిడ్ ఆసుపత్రిలోనే ఉరేసుకుని..
ఝార్ఖండ్ గడవా జిల్లా కొవిడ్ ఆసుపత్రిలో ఒకరు ఉరేసుకుని చనిపోగా.. మరొకరు ఆక్సిజన్ కొరతతో మరణించారు. నీరజ్ ఉపాధ్యాయ (39) అనే వ్యక్తి కరోనాతో ఆసుపత్రిలో చేరారు. భయాందోళనతో ఆసుపత్రిలో ఉరేసుకుని మరణించారు. అదే ఆసుపత్రిలో శివచంద్ విశ్వకర్మ (46 ) అనే మరో వ్యక్తి ఆక్సిజన్ కొరతతో మరణించారు. శ్వాస తీసుకోవడానికి కష్టమవుతోందని, ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలని కోరినా.. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఇదీ చదవండి: కరోనా పరిస్థితిపై ప్రధాని మోదీ కీలక భేటీ
ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం