నరబలి చేస్తే డబ్బులు వస్తాయన్న మూఢనమ్మకంతో.. లోకజ్ఞానం తెలియని చిన్న పిల్లాడిని చంపేశారు కొందరు దుండగులు. 9 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా తల నరికేశారు. ఈ ఘటన దాద్రానగర్ హవేలిలోని సిల్వాస్సాలో జరిగింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు వ్యక్తులు, ఒక బాలుడిని అరెస్ట్ చేశారు. మృతుడి శరీర భాగాల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
దాద్రానగర్ హవేలీలోని సైలీ గ్రామానికి చెందిన బాలుడు.. డిసెంబర్ 29 నుంచి కనిపించకుండా పోయాడు. అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సిల్వాస్సా పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేశారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. సిల్వాస్సాకు 30 కిలోమీటర్ల దూరంలో గుజరాత్‌లోని వాపిలో కాలువలో తల లేని శరీరాన్ని పోలీసులు గుర్తించారు. ఆ మృతదేహం.. దాద్రానగర్ హవేలీలో అదృశ్యమైన బాలుడిదే అని అనుమానించారు. శరీర భాగాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. దర్యాప్తులో భాగంగా ఒక బాలుడ్ని పోలీసులు పట్టుకున్నారు. అతడిని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
"గుజరాత్‌లోని తాపీ జిల్లా కప్రదా తాలూకాలోని కర్జన్ గ్రామానికి చెందిన బాలుడు.. సైలీ గ్రామంలోని చికెన్ దుకాణంలో పని చేస్తున్నాడు. అదుపులోకి తీసుకున్న బాలుడిని ప్రశ్నిస్తే.. డిసెంబర్ 29న సైలీ గ్రామం నుంచి తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేశారని తెలిసింది. డబ్బులు వస్తాయనే ఆశతో అతడ్ని నరబలి ఇచ్చారు. పోలీసులకు పట్టుబడిన బాలుడితో పాటు శైలేష్ కోహేర్కా(28), రమేష్ సన్వార్ అనే వ్యక్తులు కలిసి ఈ ఘోరానికి పాల్పడ్డారు. నరబలి ఇస్తే డబ్బు వస్తుందని శైలేష్ కోహేర్కా బాలుడి తల నరికేయాలని ప్రేరేపించగా.. అందరూ కలిసి బాలుడిని అతి కిరాతకంగా నరికేశారు. ఈ హత్యలో ఉపయోగించిన ఆయుధాలను బాలుడి సహాయంతో స్వాధీనం చేసుకున్నాము. అతడిని తదుపరి విచారణకై సూరత్‌లోని అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించాము. వాపి వద్ద తల లేని మృతదేహం లభ్యమైన తర్వాత 100 మంది సిబ్బందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి నేరాన్ని ఛేదించేందుకు పలు పోలీసు బృందాలు పనిచేస్తున్నాయి" అని సిల్వాస్సా పోలీసులు తెలిపారు.
వృద్ధురాలిపై రేప్..
పక్షవాతంతో బాధపడుతున్న 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. మంగళవారం వేకువజామున మహారాష్ట్రలోని నాశిక్‌లో జరిగిందీ ఘటన. వృద్ధురాలు పక్షవాతం కారణంగా గత ఏడేళ్లుగా మంచానికే పరిమితమై ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె బాగోగులను పొరుగున ఉన్న ఆమె సోదరుడు చూసుకుంటున్నాడు. అయితే మంగళవారం వేకువజామున 22 ఏళ్ల యువకుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం టీ ఇచ్చేందుకు వచ్చిన తన సోదరుడికి బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి:
'సబ్సిడెన్సీ జోన్ పరిధిలో 'జోషీమఠ్'.. పగుళ్లు రావడం వెనుక అనేక కారణాలు'
డాక్టర్‌గా మారిన ముఖ్యమంత్రి.. పదేళ్ల బాలుడికి విజయవంతంగా ఆపరేషన్